-
అజిత్ కుమార్ గ్యారేజ్‌లోకి అరుదైన మెక్లారెన్ సెన్నా హైపర్‌కార్
తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఉన్న అజిత్ కుమార్ తన ఖరీదైన కార్ల కలెక్షన్‌ను మరింత శక్తివంతంగా మార్చారు. లెజెండరీ ఫార్ములా వన్ డ్రైవర్ అయర్టన్ సెన్నా పేరు మీద రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత మెక్లారెన్ సెన్నా హైపర్‌కార్‌ను ఆయన ఇటీవల సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లకు పరిమితమైన అత్యంత అరుదైన కార్లలో ఒకటి.
అయర్టన్ సెన్నా పట్ల అజిత్‌కు గాఢమైన అభిమానం ఉండటం వల్లే ఈ కారు ఆయనకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ కారుపై సెన్నా సంతకంతో కూడిన మార్ల్‌బొరో లివరీ డిజైన్ కూడా ఉంది, ఇది కారుకు మరింత ప్రత్యేకతను కల్పిస్తోంది. అజిత్ స్వయంగా ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ కావడంతో, ఈ హైపర్‌కార్ ఆయన గ్యారేజ్‌లో గౌరవ స్థానాన్ని పొందింది.
ఈ మోడల్లో 4.0-లీటర్ల ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉండగా, ఇది 789 హెచ్‌పి శక్తిని మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 800 కిలోగ్రాముల డౌన్‌ఫోర్స్ సామర్థ్యంతో ట్రాక్-రెడీగా డిజైన్ చేయబడింది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వ్యవస్థను ఉపయోగించింది. అంతర్జాతీయంగా దీని ధర సుమారు ₹10 కోట్లు వరకు ఉండొచ్చని సమాచారం.
అజిత్ ఈ కారును స్వీకరించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో కారును తొలిసారి చూస్తూ అజిత్ ఉత్సాహంగా కనిపించారు. బటర్‌ఫ్లై డోర్లు పైకి లేచిన కారును చుట్టూ తిరుగుతూ పూర్తిగా పరిశీలించిన ఆయన, అనంతరం తన స్నేహితులతో కలిసి తొలి డ్రైవ్‌కు వెళ్లారు.
అజిత్ గ్యారేజ్‌లో ఇప్పటికే ఫెరారీ ఎస్ఎఫ్90, పోర్షే 911 జిటి3 ఆర్ఎస్, మెక్లారెన్ 750ఎస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. సెన్నా చేరికతో ఆయన ఆటోమొబైల్ కలెక్షన్ మరింత ప్రీమియంగా మారింది.
Read : Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం
