-
బెంగళూరులో అద్దెదారుకు భారీ వాటర్ బిల్లు షాక్
-
సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు
-
యజమానిని అడిగితే పిచ్చి సమాధానాలు ఇస్తున్నాడని ఆవేదన
బెంగళూరులోని అద్దె గృహాలు కేవలం అధిక అద్దెలు, డిపాజిట్ల విషయంలోనే కాదు, ఇప్పుడు నీటి బిల్లుల విషయంలోనూ సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు మాత్రమే నివసించే ఇంటికి ఏకంగా నెలకు రూ.15,800 వాటర్ బిల్లు రావడంతో ఓ అద్దెదారు షాక్ అయ్యాడు. తన యజమాని ఇలా అధిక బిల్లులతో మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బెంగళూరుకు చెందిన ఓ అద్దెదారు తన దురనుభవాన్ని రెడిట్‌లో పంచుకున్నాడు. “ప్రతి నెలా నా యజమాని అధిక వాటర్ చార్జీలతో వేధిస్తున్నాడు” అనే శీర్షికతో అతను చేసిన పోస్ట్‌లో, 1,65,000 లీటర్ల నీరు వాడినట్లుగా వచ్చిన రూ.15,800 బిల్లు కాపీని కూడా షేర్ చేశాడు. “మేమిద్దరమే ఇంట్లో ఉంటాం, అదీ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతాం. అయినా ప్రతి నెలా దాదాపు రూ.10,000 వాటర్ బిల్లు వస్తోంది. యజమానిని అడిగితే తప్పు ఒప్పుకోవడం లేదు. పైగా, పదిహేను రోజులకోసారి నీళ్లు కూడా సరిగ్గా రావు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని అతను వాపోయాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులకు ఇంత భారీ బిల్లు రావడం అసాధ్యమని, దీని వెనుక కచ్చితంగా ఏదో మోసం జరిగిందని వారు అభిప్రాయపడ్డారు. “ఇద్దరు వ్యక్తులకు గరిష్ఠంగా రూ.300కి మించి బిల్లు రాకూడదు. మీటర్‌లో గాలి ప్రవహించడం వల్ల రీడింగ్ పెరిగి ఉండవచ్చు, లేదా మీటర్ రీడింగ్ తీసుకునే వ్యక్తితో యజమాని కుమ్మక్కై ఉండవచ్చు” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. యజమాని ఆ నీటిని వాణిజ్య అవసరాలకు వాడుతూ ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.
“మా కుటుంబంలో నలుగురు సభ్యులం, పెద్ద గార్డెన్ ఉన్నా నెలకు 15 నుంచి 20 వేల లీటర్ల నీటిని మాత్రమే వాడతాం” అని మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. బాధితుడు పక్కింటి వారిని సంప్రదించి వారి బిల్లులు తెలుసుకోవాలని, అవసరమైతే న్యాయవాదిని సంప్రదించి యజమానిపై కేసు పెట్టాలని పలువురు సలహాలు ఇస్తున్నారు. ఈ సంఘటన బెంగళూరులో అద్దెదారుల సమస్యలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
Read also : Mega DSC : డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్: కొత్త చిక్కుల్లో ఈడబ్ల్యూఎస్ మహిళలు
