EPFO : పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త: విత్‌డ్రా నిబంధనలు సరళతరం, 12 నెలలకే 75% డబ్బు!

New PF Withdrawal Rules: 13 Norms Abolished, 75% of EPF Balance Accessible After 12 Months
  • సరళతరమైన పీఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనలు

  • 13 రకాల పాక్షిక విత్‌డ్రాలు ఒక్కటిగా విలీనం

  • కేవలం ఏడాది సర్వీసుతోనే 75 శాతం డబ్బు ఉపసంహరణ

ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ డబ్బు ఉపసంహరణ నిబంధనలను సరళతరం చేసింది. ఇకపై ఉద్యోగులు కేవలం 12 నెలల సర్వీసు పూర్తి చేసిన వెంటనే తమ పీఎఫ్ ఖాతాలోని 75 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

గతంలో ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను రద్దు చేసి, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాత విధానంలో ఉన్న సంక్లిష్టమైన అర్హత ప్రమాణాలు, వేర్వేరు సర్వీసు కాలపరిమితుల వల్ల అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేవని, ఆ ఇబ్బందులను తొలగించేందుకే ఈ మార్పులు చేసినట్లు వివరించింది. గతంలో ఏడేళ్ల వరకు ఉన్న అర్హత కాలాన్ని ఇప్పుడు అన్ని రకాల విత్‌డ్రాలకు ఒకే విధంగా 12 నెలలకు కుదించారు.

తాజా నిబంధనల ప్రకారం, ఉద్యోగి విత్‌డ్రా చేసుకునే మొత్తంలో యజమాని వాటాను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో కేవలం ఉద్యోగి వాటా, దానిపై వచ్చిన వడ్డీని మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు యజమాని వాటాను కూడా కలపడం వల్ల ఉద్యోగి చేతికి అందే 75 శాతం మొత్తం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరుద్యోగం విషయంలోనూ 75 శాతం బ్యాలెన్స్‌ను వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.

అయితే, ఉద్యోగుల దీర్ఘకాలిక సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేశారు. పదవీ విరమణ సమయానికి గౌరవప్రదమైన మొత్తం మిగిలి ఉండేలా, కనీసం 25 శాతం బ్యాలెన్స్‌ను ఖాతాలో ఉంచాలన్న నిబంధన పెట్టారు. అలాగే పెన్షన్ ప్రయోజనాలు అందరికీ దక్కేలా, పెన్షన్ ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు గతంలో ఉన్న 2 నెలల గడువును 36 నెలలకు (3 సంవత్సరాలు) పెంచారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే పింఛ‌న్‌కు అర్హత లభిస్తుంది కాబట్టి, ఈ మార్పు వల్ల ఎక్కువ మంది పింఛ‌న్‌కు అర్హత సాధిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల పింఛ‌న్‌ అర్హతపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

Read also : AP : ఆంధ్రప్రదేశ్‌ను నెం.1గా నిలుపుతాం, మంగళగిరి దేశంలోనే టాప్: మంత్రి నారా లోకేశ్

 

Related posts

Leave a Comment