- తన మెచ్యూరిటీకి సరిపోయే వ్యక్తి దొరకాలన్న నటి
- ప్రస్తుతం పెళ్లిపై ఆశలు లేవని, పిల్లలే ముఖ్యమని వెల్లడి
- తన పెళ్లికి కొన్ని కండిషన్లు ఉంటాయని వ్యాఖ్య
తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి ప్రగతి, తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు తాజాగా స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫిట్‌నెస్, వర్కౌట్ వీడియోలతో ఎప్పటికప్పుడు చర్చలో ఉండే ఆమె, ఈసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.
ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసిన ప్రగతి, భవిష్యత్తులో ఒకవేళ జీవన భాగస్వామి అవసరమని అనిపిస్తే కొన్ని కండిషన్లు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “జీవితంలో ఒక తోడు అవసరం అనేది నిజమే. కానీ, ఆ వ్యక్తి నా మెచ్యూరిటీ స్థాయికి తగినవాడై ఉండాలి. అలాంటి వ్యక్తి దొరకకపోతే మళ్లీ జీవితం కష్టమవుతుంది” అని అన్నారు.
పెళ్లి తర్వాత ఆంక్షలు, పరిమితులు విధిస్తే తాను భరించలేనని ప్రగతి స్పష్టం చేశారు. “నాకు 20 ఏళ్లు ఉంటే బహుశా సర్దుకుపోయేదాన్నేమో. కానీ ఇప్పుడు నా వయసు, నా ఆలోచనలు వేరు. అందుకే ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి ఆశలు లేవు” అని తేల్చిచెప్పారు.
ఇక తన పిల్లలే తన ప్రపంచమని చెప్పిన ప్రగతి, వారిపై గర్వంగా ఉందని తెలిపారు. “నా కొడుకు చదువు పూర్తిచేసుకుని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు యూఎస్‌లో చదువుకుంటోంది. సమాజానికి మంచి పిల్లలను అందించానన్న సంతృప్తి నాకు ఉంది” అని అన్నారు.
పెళ్లి లేకుండానే జీవితాన్ని కొనసాగించగలనని, కానీ వర్కౌట్స్ లేకుండా మాత్రం ఉండలేనని చెబుతూ తన ఫిట్‌నెస్‌పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇటీవల అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు రజత పతకాలు సాధించిన ప్రగతి, తన పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
Read : Pragathi : తెరపైనే కాదు, పవర్‌లిఫ్టింగ్‌లోనూ ఛాంపియన్! 50 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం.
