- రొమ్ము క్యాన్సర్ బాధితులకు కొత్త జీవితం అందిస్తున్న సోనూ సూద్
- 500 కుటుంబాల్లో ఆనందం నింపడం సంతోషంగా ఉందన్న రియల్ హీరో
- సమష్టి కృషితోనే ఇలాంటి పనులు సాధ్యమని వ్యాఖ్య
Sonu Sood : బాలీవుడ్ నటుడు, ‘రియల్ హీరో’గా పేరుగాంచిన సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 500 మంది మహిళలకు పూర్తి చికిత్స అందించి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును తన సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా భరించినట్లు ఆయన వెల్లడించారు.
ఇది కేవలం ఆరంభమేనని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని సోనూ సూద్ తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 500 మంది మహిళలను మేం కాపాడగలిగాం. శస్త్రచికిత్సలతో వారందరికీ కొత్త జీవితం లభించింది. 500 కుటుంబాల్లో ఆనందం నింపగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సమష్టి కృషితోనే ఇలాంటి గొప్ప పనులు సాధ్యమవుతాయి” అని తెలిపారు.
కాగా, కరోనా కాలంలోనూ సోనూ సూద్ చేసిన సేవలు మరువలేనివి. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను తన సొంత ఖర్చులతో ప్రత్యేక విమానాలు, వాహనాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించి, నిజమైన మానవతా దృక్పథంతో ‘రియల్ హీరో’గా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
Read : Chandrababu: గత ప్రభుత్వ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు నాయుడు
