Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

30 నుంచి జగనన్న ఆరోగ్య సరోక్ష

0

విజయవాడ, సెప్టెంబర్ 22, (న్యూస్ పల్స్)

ఎన్నికల వేళ జగనన్న ‘ఆరోగ్య సురక్ష’.. అనే వినూత్న పథకంతో ప్రజల ముందుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ప్రతి ఇంటికీ ప్రభుత్వం సిబ్బంది వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టి వారికి మందులు ఇవ్వడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు సిఫార్సు చేయడం ఈ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పార్టీ కోసం సీక్రెట్ సర్వే చేస్తోందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ప్రజల వద్దకు వెళ్లే వైద్య సిబ్బంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. అన్ని పథకాలు అమలవుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు. గత పాలనకు, ఈ పాలనకు పోలికలేంటని అడుగుతున్నారు. ఆ తర్వాత వారినుంచి వాలంటీర్లు, గృహసారథులకు సమాచారం వెళ్తోంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేపట్టిన సీక్రెట్ సర్వే అని అంటున్నారు.

ఇటీవల జగనన్న సురక్ష పేరుతో రుసుము లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ముందుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజల వద్దకు వెళ్లి వారికి అవసరం ఉన్న సర్టిఫికెట్ల గురించి నమోదు చేసుకుని ఆ తర్వాత గ్రామసభల్లో ఆయా సర్టిఫికెట్లు మంజూరు చేసేవారు. ఇప్పుడు అదే విధానంలో జగనన్న ఆరోగ్య సురక్ష తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. ఈనెల 16నుంచి సర్వే మొదలైంది. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ లు గ్రామం, పట్టణంలో.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకూ 18.81 లక్షల ఇళ్లను వీరు సందర్శించాయి. జ్వరం, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, బీపీ, షుగర్‌ లక్షణాలున్న వారికి ఇంటివద్దే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సురక్షలో భాగంగా ఏడు రకాల పరీక్షలను ఇంటి వద్దే చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ జరిగిన సర్వేలో 20 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారని అధికారిక సమాచారం.

ఈ పరీక్షల ఫలితాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు.. హెల్త్ క్యాంప్ నిర్వహించిన సమయంలో అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సురక్షలో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి స్పెషలిస్ట్‌ డాక్టర్లతో ప్రతి గ్రామం, పట్టణంలో హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తారు. హెల్త్‌ క్యాంప్‌ల నిర్వహణ షెడ్యూల్‌ కు అనుగుణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే మొదలైంది. సర్వే పూర్తయిన తర్వాత, మెడికల్ రిపోర్ట్ లు వచ్చిన తర్వాత.. హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తారు. మొత్తం 45 రోజుల పాటు హెల్త్ క్యాంప్ లు జరుగుతాయి. ఏపీలోని 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 500కు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను కవర్‌ చేసేలా ఈ క్యాంప్‌ లు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రతి క్యాంప్‌ లో నలు­గు­రు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజల­కు వైద్య సేవలు అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారి లిస్ట్ తీసి.. వారిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు.

ఆరోగ్య సురక్ష ద్వారా.. ఇప్పటి వరకూ వ్యాధి నిర్థారణకు వెళ్లనివారికి ఉపయోగం ఉంటుంది. అదే సమయంలో పరీక్షలకోసం ఇల్లు దాటి బయటకు రాలేనివారికి కూడా ఉపయోగం ఉంటుందని అంటున్నారు. బాగానే ఉంది కానీ.. ఆరోగ్య సురక్ష పేరుతో ప్రజల వద్ద ప్రభుత్వ సిబ్బంది అదనపు వివరాలు సేకరించడమేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. వైద్య పరీక్షల వరకు ఓకే కానీ.. పథకాల వివరాలను కొంతమంది అడుగుతున్నారని చెబుతున్నారు. ఆ వివరాలతో సీక్రెట్ సర్వే చేపడుతున్నారనేది టీడీపీ నేతల అనుమానం. ఆరోగ్య సురక్ష పూర్తయ్యేలోగా.. ప్రజల మూడ్ ఏంటనేది ప్రభుత్వం నేరుగా తెలుసుకునే అవకాశముందనేది కాదనలేని విషయం. వాలంటీర్లు వెళ్లి ప్రభుత్వ పథకాల విషయంలో సంతృప్తిగా ఉన్నారా అంటే.. లేకపోయినా ఉన్నామని చెప్పేందుకు అవకాశముంది. అదే వైద్య సిబ్బంది అడిగితే.. తటస్థులు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అందుకే ప్రభుత్వం వారితో వివరాలు సేకరిస్తోందని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie