Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

6 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు

0


విజయవాడ, మార్చి 2 (న్యూస్ పల్స్)
 తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ విశ్రాంతి ఎరుగక పార్టీ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఈనెల ఆరో తేదీ నుంచి మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాగలం పేరుతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. మార్చి ఆరో తేదీన ప్రారంభం కానున్న ఈ సభలు వరుసగా ఐదు రోజులుపాటు ఐదు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ ఏర్పాటు చేస్తోంది. ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న ఈ సభల్లో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఐదు రోజులపాటు భారీ ఎత్తున ప్రజాగలం కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ప్రజాగలం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి బలమైన స్థానాలను లక్ష్యంగా చేసుకొని ఈ సభలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ ను ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభ విజయవంతమైందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరో వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కూటమికి వస్తున్న ప్రజాధరనను కొనసాగించే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాలుపంచుకునేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. బిజెపి కూడా కూటమిలో చేరితే ప్రజాగళం సభల్లో బిజెపి నాయకులు కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా సభలు ఈ నెల నాలుగో తేదీతో రాప్తాడులో ముగియనున్నాయి. ఒక్కరోజు విరామం తీసుకుని ఆరో తేదీ నుంచి ప్రజాగళం కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రజాగళం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమం కర్నూలు జిల్లా నంద్యాలలో తొలిరోజు ఏర్పాటు చేయబోతున్నారు. ఉదయం కర్నూలులో పూర్తయిన వెంటనే మధ్యాహ్నం మైదుకూరులో మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున ప్రజలు వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ కేడర్ కు ముఖ్య నాయకుల నుంచి సమాచారాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే 25 పార్లమెంటు స్థానాల పరిధిలో నిర్వహించిన రా కదలిరా సభలు విజయవంతం కావడంతో.. ప్రజా గళం కార్యక్రమాన్ని కూడా అంతే స్థాయిలో విజయవంతం చేయడంపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆయా అభ్యర్థులు భారీ ఎత్తున జనాలను సమీకరించేలా పార్టీ అధినాయకత్వం వారికి ఆదేశాలను జారీ చేసింది. ప్రజాగళం సభల తరువాత ఆయా ప్రాంతాల్లో పార్టీ మైలేజీ ఒక్కసారి పెరిగేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి సభల్లోను అక్కడ నెలకొన్న సమస్యలను ఎలుగెత్తి చాటడంతోపాటు తాము అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తామన్న విషయాలను కూడా చంద్రబాబు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie