AP : ఏపీ లేడీ డాన్ నిడిగుంట అరుణ విచారణలో కొత్త విషయాలు:ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసులు తమ శైలిలో విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా నిన్న రెండో రోజు పోలీసులు ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఏపీ లేడీ డాన్ నిడిగుంట అరుణ విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసులు తమ శైలిలో విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా నిన్న రెండో రోజు పోలీసులు ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లతో, రాజకీయ నాయకులతో ఆమెకు ఉన్న సంబంధాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
కోవూరు పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో అరుణను సుమారు 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆమె ఎందుకు అంత ఆసక్తి చూపించారు, అతన్ని బయటకు తీసుకురావడానికి ఎవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు లోతుగా ప్రశ్నించారు. అపార్ట్మెంట్ ఫ్లాట్ వివాదంలో యజమానిని బెదిరించిన ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారు అనే అంశంపైనా ఆరా తీశారు.
కొన్ని ప్రశ్నలకు అరుణ సమాధానం చెప్పగా, మరికొన్నింటికి తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, పెరోల్ విషయంలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు సహకరించినట్లు ఆమె అంగీకరించినట్లు సమాచారం. తనపై కావాలనే కొందరు కక్షగట్టారని, మీడియానే లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆమె పోలీసులతో అన్నట్లు సమాచారం.
ఈ విచారణలో భాగంగా అరుణ కుటుంబ నేపథ్యం, ఆమె ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్లు, స్థలాల పేరుతో చేసిన మోసాలపై కూడా పోలీసులు వివరాలు సేకరించారు. విచారణ తర్వాత ఆమెను తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. మూడో రోజు విచారణ ఈరోజుతో ముగుస్తుంది. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి, ఒంగోలు సబ్‌జైలుకు తరలించనున్నారు.
Read also:KetireddyPeddareddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
