AP : మహిళల కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం: లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష్యం

Andhra Pradesh Government Launches Major Initiative for Women's Economic Empowerment
  • వచ్చే మహిళా దినోత్సవానికి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

  • వ్యాపార విస్తరణకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక చేయూత

  • ఈ నెల‌ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డీఆర్‌డీఏ ప్రత్యేక సర్వే

ఏపీలో మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆశయంతో వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందిని వ్యాపారవేత్తలుగా తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వేను ప్రారంభించనున్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. అధికారులు నేరుగా మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. వారు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు, ఎంత ఆదాయం పొందుతున్నారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు వంటి కీలక సమాచారాన్ని నమోదు చేసుకుంటారు. ఈ సమాచారం ఆధారంగా యూనిట్లను జీవనోపాధుల, ఎంటర్‌ప్రెన్యూర్, ఎంటర్‌ప్రైజెస్ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తారు.

ఈ సర్వేలో గుర్తించిన అర్హులైన మహిళలకు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించనుంది. బ్యాంకుల ద్వారా కనిష్ఠంగా రూ. 10 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా స్త్రీనిధి పథకం ద్వారా రూ. లక్ష వరకు, ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం కింద రూ. 2 లక్షల నుంచి అవసరాన్ని బట్టి రూ. 10 లక్షల వరకు కూడా రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, యూనిట్ విస్తరణకు రుణాలు పొందాలంటే, ఆ వ్యాపారం ద్వారా కనీసం మరొకరికి ఉపాధి కల్పించాలనే నిబంధనను పాటించాల్సి ఉంటుంద‌ని అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చాలామంది మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా డెయిరీ, పచ్చళ్లు, ఆహార శుద్ధి, కలంకారి, పేపర్ ప్లేట్లు వంటి చిన్న తరహా పరిశ్రమలను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్ల వివరాలను, ఫోటోలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి పారదర్శకత పాటిస్తున్నారు. ఈ పథకంపై మరింత సమాచారం కావాల్సిన వారు స్థానిక డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

Read also : SudarshanVenu : తిరుమల పాలకమండలిలో కొత్త సభ్యుడిగా సుదర్శన్ వేణు

 

Related posts

Leave a Comment