-
హైదరాబాద్ మధురానగర్‌లో అద్దె ఇంట్లో ఓనర్ నిర్వాకం
-
బాత్రూంలోని బల్బులో రహస్యంగా కెమెరా ఏర్పాటు
-
నిఘా కెమెరాను గుర్తించి షాకైన అద్దెదారుడు
హైదరాబాద్‌లోని మధురానగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించే వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. తాము సురక్షితంగా ఉంటామని భావించే ఇంట్లోనే ఇంటి యజమాని నీచమైన చర్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, మధురానగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తికి తమ బాత్రూమ్లోని బల్బుపై అనుమానం వచ్చింది. దాన్ని పరిశీలించగా, అందులో అత్యంత చాకచక్యంగా అమర్చిన రహస్య కెమెరా కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గతంలో హాస్టళ్లు, హోటళ్లు లేదా షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్‌లో మాత్రమే ఇలాంటి సంఘటనలు బయటపడేవి. కానీ, ఇప్పుడు ఏకంగా అద్దె ఇళ్లలోని బాత్రూంలు, బెడ్రూంలలో కూడా ఇలాంటివి జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో లక్షలాది మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో, అద్దెకు దిగే ముందు బాత్రూంలు, బెడ్రూంలలోని బల్బులు, స్మోక్ డిటెక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను, వెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. అద్దె ఇంట్లో కూడా భద్రత లేకపోతే ఎలా అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : ITNotice : ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారికి కూడా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్!
