Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బీఆర్ఎస్​లో అసంతృప్తి సెగలు

Dissatisfaction in BRS

0

టిక్కెట్లు రాకపోవడంతో నేతల ఆశలు గల్లంతు
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి నిర్ణయం?
క్యాడర్ తో రహస్య సమాలోచనలు

బీఆర్ఎస్​అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో అసంతృప్తికి తెరలేపింది. ఊహించినట్టే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్​మళ్లీ టిక్కెట్లు ఖరారు చేయడం ఆయా స్థానాల నుంచి పోటీకి సిద్ధమైన బీఆర్ఎస్​నేతల ఆశలు ఒక్కసారిగా గల్లంతయ్యాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్​టిక్కెట్​తమకే వరిస్తుందనే ఆశతో ప్రజల్లో విస్తృతంగా పర్యటించిన ఆశావాహులు ఇప్పుడు తమ రాజకీయ భవితవ్యంపై బెంగపెట్టుకున్నారు.

అనుచరులతో రహస్య చర్చలు..
అధినేత ప్రకటించిన అభ్యర్థుల మార్పుపై ఆశలు వదులుకోని ఆశావాహులు ఇప్పటికే వ్యూహారచనలో నిమగ్నమయ్యారు. కొందరు అధిష్టానం నుంచి ఒత్తిడి లేకపోతే వచ్చే ఎన్నికల్లో రెబల్ గా బరిలో దిగాలని భావిస్తుంటే.. ఇంకొందరు స్వతంత్ర అభ్యర్థులుగానైనా పోటీ చేసి గెలిచాక బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విభేదించి ఇప్పటికే ప్రచార పర్వానికి తెరలేపిన పలువురు సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొందరు నేతలు తమ అనుచరులతో రహస్యంగా చర్చలు మొదలుపెట్టారు. వారి అభీష్టం, సలహాల మేరకు.. వచ్చే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

తుమ్మలకు నో ఛాన్స్..
రాజకీయ ఉద్దండుడు, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి టికెట్​ఆశించారు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పని చేసిన ఆయన.. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఎలాంటి పదవీయోగానికి నోచుకోలేదు. కాగా ఈసారి పాలేరు టికెట్​కచ్చితంగా తనకే వస్తుందని భావించారు. కానీ కేసీఆర్ మళ్లీ ఉపేందర్ వైపే మొగ్గు చూపడం.. ఇటు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం సెగ్మెంట్లలో తుమ్మలకు అవకాశం కల్పించకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ ప్రశ్నార్థకంగా మారింది. ఇటు గత ఎన్నికల్లో భూపాలపల్లిలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గండ్రా వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయిన మధుసూదనాచారికి ఈసారి అసెంబ్లీ టికెట్​దక్కలేదు.

వనమావైపే సీఎం మొగ్గు..
కొత్తగూడెం నుంచి టికెట్​ఆశించిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, జలగం వెంకట్రావ్​కు కూడా సీఎం అవకాశం కనిపించలేదు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్​కచ్చితంగా తనకే వస్తుందని భావించిన గడల.. ఏడాదిన్నర క్రితమే జీఎస్ఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, శుభకార్యాలు, పెద్ద దిక్కు కోల్పోయిన పేదల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడు రాఘవపై అవినీతి ఆరోపణల ఫిర్యాదులు రావడంతో ఈసారి వెంకటేశ్వరరావుకు టిక్కెట్టు రావడం అనుమానమేననే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా టిక్కెట్​మళ్లీ వనమాకే కేటాయించడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఉప్పల్ సెగ్మెంట్ పై సీఎం అనూహ్య నిర్ణయం..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోపాటు ఆయన తమ్ముడు శ్రీకాంత్​ గౌడ్​ పైనా గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మహబూబ్​నగర్​నుంచి బరిలో నిలవాలనుకున్న తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి టికెట్​కోసం విశ్వప్రయత్నాలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు దీటుగా నియోజకవర్గ ప్రజల్లో అభిమానం చూరగొన్నా.. ఫలితం దక్కలేదు. ఉప్పల్ సెగ్మెంట్ టికెట్​విషయంలో కేసీఆర్​అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన బొంతు రామ్మోహన్ కు మొండి చెయ్యి చూపిన సీఎం.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన బండారి లక్ష్మారెడ్డికి టిక్కెట్టు ఇవ్వడం హాట్ టాపిక్​ గా మారింది. కూకట్ పల్లికి చెందిన సీనియర్ నాయకుడు గుట్టిముక్కుల వెంకటేశ్వరరావు ఈ సారి తనకు టిక్కెట్టు ఖాయమని భావించారు. కానీ మళ్లీ సిట్టింగ్​ ఎమ్మెల్యే కృష్ణారావు వైపే అధినేత మొగ్గు చూపారు.

గుత్తా తనయుడి ఆశలు గల్లంతు..
మరోవైపు వచ్చే ఎన్నికల్లో నల్లగొండ లేదా మునుగోడు నుంచి పోటీకి సిద్ధమైన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. కొన్ని నెలల నుంచి ప్రజల్లో తిరుగుతున్న ఆయన.. టికెట్​విషయంలో తన తండ్రిపై నమ్మకం పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మళ్లీ టికెట్​దక్కడంతో అమిత్ రాజకీయ భవితవ్యానికి ఆదిలోనే పుల్​ స్టాప్ పడిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైన నల్లగొండ పట్టణం 8వ వార్డు కౌన్సిలర్​ పిల్ల రామరాజు యాదవ్.. ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.20లక్షలపైనే ఖర్చు పెట్టుకున్నారు. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండడంతో కుల సంఘాల మద్దతుతో ఎమ్మెల్యేగా రాణించాలని స్కెచ్ వేశారు. ఇదే క్రమంలో తన సామాజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ద్వారా టికెట్​కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయినా ఆయనకు అవకాశం దక్కలేదు. కాగా కొంతకాలంగా పిల్లి రామరావు రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ అనుమానమేనని తెలుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie