Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కొత్త డీజీపీ ఎవరు..

0

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీని నియమించేందుకు వైసీపీ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత డీజీపీతో పాటు మరో ఐదారు పేర్లను యూపీఎస్సీకి సిఫార్సు చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నియామకం వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పటికే ఏడాది సర్వీస్ ఉన్న దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ స్థానంలో అనూహ్యంగా 2022 ఫిబ్రవరి 15న రాజేంద్రనాథ్‌ రెడ్డిని డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ క్రమంలో 36ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న సవాంగ్ ఏడాదికి పైగా సర్వీసు మిగిలి ఉండగానే స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు.పదవీ విరమణకు ముందే సవాంగ్‌కు పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. 2022 ఫిబ్రవరి 19న రాజేంద్రనాథ్‌ పూర్తి అదనపు హోదాలో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.మరోవైపు రాజేంద్రనాథ్‌ రెడ్డి నియామకాన్ని యూపీఎస్సీ అమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో మరో ఐదు పేర్లతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం కోసం సిషార్సు చేసినట్లు తెలుస్తోంది. . రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్. అనురాధ, 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమల రావు, 1991కు చెందిన మహమ్మద్ హసన్ రజా, 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తా, పి.సీతారామాంజనేయులు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

1990 బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌తో పాటు అంజనా సిన్హాలను రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా కోర్టు ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. దీంతో వారి పేర్లను సీనియారిటీ ఆధారంగా పరిగణలోకి తీసుకోలేదు. 1989 బ్యాచ్‌కు చెందిన ఏబి. వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలతో ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.1987 క్యాడర్‌కు చెందిన అనురాధకు ఈ ఏడాది అక్టోబర్‌ వరకు పదవీ కాలం ఉంది. అక్టోబర్‌ నాటికి సార్వత్రిక ఎన్నికల హడావుడి కూడా మొదలైపోతుంది.

టీడీపీ వైఖరిపై కమలనాధుల్లో సందేహాలు.

డీజీపీగా అనురాధ వైపు ప్రభుత్వం మొగ్గు చూపితే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున పదవీ కాలం పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరాల్సి ఉంటుందని చెబుతున్నారు. యూపీఎస్సీ షార్ట్‌ లిస్ట్‌లో స్థానం దక్కించుకుని, రాష్ట్ర ప్రభుత్వం అమోదిస్తే ఏపీకి మొదటి మహిళా డీజీపీ అయ్యే అవకాశం అనురాధకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె వైపు ఎంతవరకు మొగ్గు చూపుతుందో తెలీదు.1989బ్యాచ్‌కు చెందిన ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమలకు 2025 వరకు పదవీ కాలం ఉంది. ఆయన కూడా డీజీపీ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

1991 బ్యాచ్‌కు చెందిన అధికారుల్లో డీజీపీ పదవికి అర్హులైన వారిలో మాదిరెడ్డి ప్రతాప్,మహమ్మద్ హసన్ రాజాలు ఉన్నారు.వీరిలో రజా పదవీ కాలంలో జులైతో ముగియనుంది. మాదిరెడ్డి ప్రతాప్‌కు 2026వరకు వ్యవధి ఉంది. 92 బ్యాచ్‌కు చెందిన మరో సీనియర్ అధికారి హరీష్‌ కుమార్ గుప్తాకు 2025వరకు పదవీ కాలం ఉంది.1992 బ్యాచ్‌కు చెందిన పిఎస్సార్ ఆంజనేయులు, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిల పేర్లు ప్రధానంగా పొలిటికల్, బ్యూరోక్రాట్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి ఏడాదికి పైగా ఆ పదవిలో ఉన్నారు. మరో అధికారి పిఎస్సార్ ఆంజనేయులుకు 2026 ఆగష్టు వరకు పదవీ కాలం ఉంది.

పవన్ కామెంట్స్ తో ప్రకంపనలు.

ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా ఉన్న సీతారామాంజనేయులు పేరును కూడా డీజీపీ రేసులో కొట్టిపారేయలేమని చెబుతున్నారు. యూపీఎస్సీ సిఫార్సు చేసే పేర్ల జాబితాలో ఉండే ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వానికి డీజీపీ నియామకం అత్యంత కీలకం కానుంది. ఓ వైపు శాంతిభద్రతలను అదుపు చేయడంతో పాటు ఎన్నికలను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి అంతరంగంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనే దానిపై అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని పూర్తి స్థాయిలో డీజీపీగా నియామకం కోసం లాంఛనాలు పూర్తి చేస్తారా, ఆయన స్థానంలో మరొకరి వైపు సిఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలి పోనుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie