Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఛలో గిద్దలూరు.

0

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని సంకేతాలొస్తున్న వేళ ప్రకాశంజిల్లాలో జనసేన నేతలంతా ఆ సీటుపైనే గురిపెట్టారు. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలకంటే గిద్దలూరే అందరికీ ది బెస్ట్‌గా కనిపిస్తోందట. టీడీపీ పొత్తులో ఆ సీటు తెచ్చుకోగలిగితే గెలుపు నల్లేరుమీద బండి నడకేనన్న భావనతో ఉన్నాయట జనసేన పార్టీ శ్రేణులు. ఎందుకంటే జిల్లాలోనే కాపు ఓటర్లు ఎక్కువగా ఉంది గిద్దలూరులోనే. అంతే కాకుండా 2009లో ప్రజారాజ్యానికి పట్టంకట్టారు ఇక్కడి ఓటర్లు.

 

అందుకే జనసేన టికెట్‌ రేసులో ఉన్న ముఖ్య నేతలంతా చలో గిద్దలూరు అంటున్నారు. 2009లో ప్రకాశంజిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క గిద్దలూరులోనే ప్రజారాజ్యం నుంచి అన్నా రాంబాబు గెలిచారు. కాపు ఓటర్లు కలిసిరావటంతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 7వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారాయన.ఇప్పుడు గిద్దలూరు సీటుపై జనసేన గురిపెట్టడానికి ఇది కూడా ప్రధాన కారణమంటున్నారు. ఆ సామాజికవర్గంనుంచి సీటు ఆశిస్తున్న నేతలు.. గిద్దలూరు అయితే గన్‌షాట్‌గా గెలవొచ్చనుకుంటున్నారు.

 

చీరాల కాపు సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్న ఆమంచి స్వాములు గిద్దలూరు సీటుపై కర్చీఫ్‌ వేశారట. ఇటీవల జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన ఆమంచి స్వాములు.. పార్టీలో చేరి కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారట. తర్వాత పార్టీ వ్యవహారాలు చూసే పెద్దలకు మాత్రం గిద్దలూరు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని చెప్పారట. దీంతో ఆమంచి స్వాములుతో పాటు మరికొందరు నేతలు గిద్దలూరులో ఛాన్స్‌కోసం పార్టీ పెద్దలదగ్గర మంతనాలు మొదలుపెట్టారు.పొత్తుకుదిరితే ప్రకాశంజిల్లాలో జనసేన పక్కాగా అడిగే సీటు గిద్దలూరే. అందులో నోడౌట్‌.

వారాహి యాత్రలోనూ దీక్ష.

అదే సమయంలో గిద్దలూరు సీటు జనసేనకిస్తే ఇప్పటికే ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటూ స్పీడ్‌పెంచిన మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పరిస్థితి ఏంటన్నదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల.. తరువాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీనుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో 81 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమితో పట్టుదలగా పనిచేసి పార్టీని బలోపేతం చేసే పన్లో ఉన్నారు ముత్తుముల. సైకిల్‌ పార్టీ కేడర్‌కూడా ఫుల్‌ జోష్‌లో ఉందక్కడ.

 

ఇలాంటి పరిస్థితుల్లో గిద్దలూరు సీటుని జనసేనకిస్తే ముత్తుముల పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గిద్దలూరు సీటు వదులుకునే ప్రసక్తే లేదంటున్నారట ముత్తుముల, ఆయన అనుచరులు.గిద్దలూరు టీడీపీదేనని మాజీ ఎమ్మెల్యే పట్టుదలగా ఉన్నా.. జనసేన నేతలు మాత్రం తమ ప్రయత్నాలు మానడం లేదట. ప్రకాశంజిల్లా నుంచి పార్టీ అధినేతని కలిసిన సమయంలో నేతలు చూచాయగా గిద్దలూరు అయితే గ్యారంటీగా గెలుస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట.

 

దీంతో టీడీపీ నేతలు కూడా ముందే అలర్ట్‌ అవుతున్నారు. గిద్దలూరు సీటును జనసేనకు ఇవ్వొద్దంటూ అధినేతకు ఇప్పటినుంచే సంకేతాలు పంపుతున్నారు. ఇదంతా చూస్తున్నవారు మాత్రం ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే అంటున్నారట. మరి పొత్తు ఎత్తుల్లో ఎవరు నెగ్గుకొస్తారో, ఎవరు చిత్తవుతారోగానీ గిద్దలూరు చుట్టూ గట్టి రాజకీయమే నడుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie