Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రాజకీయం…

0

విజయవాడ, ఫిబ్రవరి 15  (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద రాజకీయ ఇష్యూగా రాజధాని అంశం ఎన్నికల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైన లేనిపపోని సమస్యలను నెత్తి మీదకు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న వాటిలో మొట్టమొదటిది మూడు రాజధానుల అంశం. ఎక్కడో సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయని ఏపీలోనూ అమలు చేస్తామని ఏవో రెండు సంస్థలతో నివేదికలు తెప్పించుకుని అప్పటికప్పుడు తీర్మానాలు చేసేశారు. కానీ నాలుగేళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు సరి కదా..ఉన్న రాజధాని అమరావతిని దాదాపుగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీ రాజధాని ఏదీ  అంటే.. ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే హైదరాబాద్ అని చెప్పుకుంటే బాగుంటుందని అనుకున్నారేమో కానీ.. ఏపీకి రాజధాని కట్టుకునే స్థోమత లేదు కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరుతామని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరయిన వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో మరింత చర్చనీయాంశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎందుకు వద్దో ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పలేకపోయింది.

 

అమరావతిని శ్శశానం అన్నారు.. అవినీతి అన్నారు.. మరొకటి అన్నారు… అక్కడేమీ లేవు అంతా గ్రాఫిక్సే అన్నారు. అయితే  అమరావతిలోనే ఐదేళ్లుగా  పరిపాలన సాగుతోంది.  అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం.. మంత్రుల కార్యాలయాలు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మరే  ముందు 45 వేల కోట్ల రూపాయల విలువైన పనులు రేయింబువళ్లు జరుగుతూ ఉండేవి. పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యే స్టేజ్‌కు వచ్చాయి. అన్నింటినీ నిలిపివేశారు. అన్నీ పాడుబడిపోయాయి. అలా వదిలేశారు. కానీ అమరావతి రాజధానిగా ఎందుకు  వద్దో మాత్రం ప్రజలకు క్లారిటీగా  చెప్పలేకపోయారు. ఏపీకి రాజధాని లేదన్నది అబద్దం. ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇది ఏకగ్రీవంగా జరిగిన నిర్ణయం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్క చోట కూడా.. తమ ప్రాంతానికి రాజధాని కావాలని ఉద్యమాలు జరగలే్దు. కనీసం డిమాండ్లు రాలేదు. అందరూ ఏకగ్రీవంగా రాజధానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు సీఎంగా ఉండి అమరావతిని నిర్వీర్యం చేసిన సీఎం జగన్ కూడా.. అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. అమరావతికి మద్దతిస్తున్నానన్నారు. అంతకు ముందు రాజధాని నిర్మాణంలో ఆయన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని వీడియోలు ఉన్నాయి. దీంతో అమరావతికి ఎలాంటి సమస్యా ఉండదనుకున్నారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ తనకు రాజధాని  మార్చే ఉద్దేశం లేదనే అందరికీ చెప్పారు. రాజధాని అమరావతిగానే ఉంటుందని కావాలంటే మేనిఫెస్టోలనేపెడతామని  మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా  చెప్పారు.

 

కానీ అధికారంలోకి చేతిలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ అమరావతి అంతు చూశారు. నిజానికి సీఎం జగన్ రెండో సారి కాకండా… 2014లో అయిన ముఖ్యమంత్రి అయి ఉంటే.. మూడు రాజధానులు  కాదు.. ఏడు రాజధానులు అన్నా.. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వచ్చి ఉండేవి కాదు. ఎందుకంటే.. రాజధాని నిర్ణయం అప్పటికీ రాష్ట్రం చేతుల్లో  ఉంది. మొదట ఏర్పడే ప్రభుత్వానికి ఆ అవకాశం వచ్చింది. రాజధాని విషయంలో ఎలాంటి చట్టాలు లేవు. కానీ ఆ అవకాశం జగన్ కు రాలేదు. చంద్రబాబుకు వచ్చింది.  చంద్రబాబు ప్రభుత్వం అందరితో చర్చించి.. ఏకగ్రీవంగా అమరావతిని ఖరారు చేసింది. జగన్ కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఆ మెరకు చట్టం చేసి సీఆర్డీఏను ఏర్పాటు చేసి.. రైతుల వద్ద నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అన్నారు. మరి రాజధానికి భూములిచ్చిన రైతుల సంగతేంటి ?. చట్ట ప్రకారం వారికి చేయాల్సింది చేయకుండా.. వారిని రోడ్డున  పడేస్తామంటే..  రాజ్యాంగం ఎలా ఊరుకుంటుంది ?.  అదే జరిగింది. సీఎం జగన్ మూడు రాజధానులు చట్ట విరుద్ధం కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. అదే చట్టబద్ధంగా రైతులందరికీ పరిహారం చెల్లించేసి ఉంటే.. మూడు కాదు. ఎన్ని రాజధానులు అయినా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అటు రైతులకు పరిహారం ఇవ్వకుండా.. ఇటు వారి భూముల  అమ్మకాలు, పంచేయడాలు చేసి.. రాజధానిని మాత్రం అక్కడ ఉంచను అంటే న్యాయస్థానాల్లో ఎలా  నిలబడుతుంది.

 

మూడు  రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి గత ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసి ఉంటే ఇంత వ్యతిరేకత  వచ్చి ఉండేది కాదు.కానీ ఆయన అమరావతికే మద్దతు పలికి అదికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లే సమయం వచ్చింది. అటు రాజధానిని  నిర్వీర్యం చేశారు.. ఇటు మరో రాజధానిని రెడీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నది  ఆసక్తికరంగా ఉంది. సిద్ధం సభలను ఉత్తరాంధ్రలో పెట్టినప్పుడు మూడు రాజధానుల గురించి జగన్ మాట్లాడలేదు. ఐదేళ్ల పాటు ఇదిగో వైజాగ్ వచ్చేస్తున్నా..అదిగో వైజాగ్ వచ్చేస్తున్నా అన్నారు కానీ..  వెళ్లలేకపోయారు.  రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన తర్వాత  ఇప్పుడు.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంత కాలం కొనసాగించాలని కేంద్రంతో మాట్లాడతామంటున్నారు. దీని వల్ల ప్రజలకు .. రాష్ట్రానికి  వచ్చే లాభమేంటి ?ఉమ్మడి రాజధాని పేరుతో కొత్తగా రాజకీయాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారు. నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండటం వల్ల ఏపీకి పైసా ప్రయోజనం లేదు. ఇప్పుడు దాన్నే కొనసాగిస్తామని కోరడం దేనికో వైసీపీ నేతలకే తెలియాలి. సెంటిమెంట్ రాజకీయాలు కోసం ఇలాంటి వాదన వినిపిస్తున్నారేమో కానీ.. ప్రజలకు మాత్రం.. ఈ విషయంలో ఎన్నికలకు వెళ్లే ముందు తమ వాదన ఖచ్చితంగా వినిపించాల్సి ఉంది.  తమ విధానం ఎందుకు  ఫెయిలయిందో చెప్పాలి.. రాష్ట్రానికి జరిగిన నష్టానికి పరిష్కరమేంటో చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలు పాలనను తిరస్కరించే ప్రమాదం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie