Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కేసీఆర్ గైర్హాజర్ కి కారణం ఏంటీ

0

హైదరాబాద్, ఫిబ్రవరి 15.(న్యూస్ పల్స్)
మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొన్నామని వచ్చే సమావేశాల నుంచి టైగర్ వస్తుందని కాంగ్రెస్ పరిస్థితి తేలిపోతుందని కేటీఆర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా దాదాపుగా ప్రతీ రోజూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలను చూసిన వారంతా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం ఖాయమనుకున్నారు. కానీ కేసీఆర్ రావడం లేదు. ఒక రోజు వచ్చేస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ రాలేదు. మధ్యలో  నల్లగొండ సభకు హాజరు కావడంతో అనారోగ్యం కారణాన్నీ చెప్పే పరిస్థితి లేదు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ పదే పదే కార్నర్ చేస్తోంది. ఎవరు మాట్లాడినా విలువ లేదని ప్రతిపక్ష నేత రావాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంత తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నా కేసీఆర్ మాత్రం సభకు హాజరు కావడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారానికి దూరమైంది. ఆ తర్వాత కేసీఆర్ నగర సమీపంలోని ఎర్రవెల్లిలోని తన ఫార్మ్ హౌస్ లో బాత్రూమ్ కి వెళుతూ జారిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ఆస్పత్రిలో తుంటికి ఆపరేషన్ చేయించుకున్నారు.  హైదరాబాద్ నందీనగర్ లోని తన ఇంట్లో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఫార్మ్ హౌస్ చేరుకున్నారు. పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.  నల్లగొండ సభకు హాజరయ్యారు.  

 

అయినా ఆయన మాత్రం అసెంబ్లీకి  హాజరు కావడం లేదు. కేసీఆర్ సభకు హాజరు కాని అంశాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.  కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటికి రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తొలి సమావేశానికి గానీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగానికీ దూరంగానే ఉన్నారు. మధ్యలో ఒకరోజు వచ్చి స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లారు తప్ప అసెంబ్లీ వైపు రాలేదు.  “తెలంగాణ సమాజానికి నీళ్లు ప్రాణప్రాయం. కృష్ణా నదీ జలాలలపై ఐదారు జిల్లాలు ఆధారపడి బతుకుతున్నాయి. చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఫార్మ్ హౌస్ లో ఎందుకు దాక్కున్నాడు. ఇలా చేయడమంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు ఆ పెద్దమనిషి సభకు రావాల్నా, లేదా. సభకు రాకుండా ఫార్మ్ హౌస్లో దాక్కుని తప్పించుకోవాలంటే ఎలా” అని అసెంబ్లీలో ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి . తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలపైన. అటువంటిది కృష్ణా నది జలాలపై నిర్మించిన ప్రాజెక్టులపై ఆధారపడి ఐదారు జిల్లాలు జీవనం సాగిస్తున్నాయి. అటువంటి ప్రాజెక్టులపై చర్చ సాగుతున్నప్పుడు కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొని సరైన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు తామంతే ఒకతాటిపై ఉన్నామనే సంకేతం ఇస్తే బాగుండేదని. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదని భావిస్తున్నారు.  ప్రాంతీయ పార్టీలు.. ఎక్కువగా వ్యక్తుల ప్రాతిపదికగా లేదంటే కుటుంబాల నాయకత్వంలోనే నడుస్తుంటాయి. దానికి మిగతా వాళ్లు కట్టుబడి ఉండాలని రూల్ లేకపోయినా అంతసూత్రం మాత్రం అలాగే ఉంటుంది.  

 

అసెంబ్లీకి ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే ఏ వైపు నుంచి సమాధానం రాదు.    హరీశ్ రావు చెప్పింది కూడా అలాగే ఉంది. సభకు ఎందుకు రాలేదో చెప్పలేదు గాని ‘కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ ని అనేంత మాత్రపు వాళ్లా‘ అని ఎదురుదాడి చేశారు. రేవంత్ రెడ్డితో కేసీఆర్ రాజకీయ వైరం గురించి చెప్పాల్సిన పని లేదు. రేవంత్ పేరును కూడా ఆయన ప్రస్తావించే వారు కాదు. ఇప్పుడు  ఇప్పుడు అదే వ్యక్తి సీఎం కావడం, తాను కూర్చున్న కుర్చీలో కూర్చొని ఆదేశాలు ఇవ్వడంపై కేసీఆర్ జీర్ణించుకోలేకపోవచ్చునని అంచనావేస్తున్నారు. రేవంత్ రెడ్డికి గతంలో అసెంబ్లీలో చాలా సార్లు అవమానాలు జరిగాయి. అలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నారన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే కేసీఆర్ పట్ల కాంగ్రెస్ కనీ..రేవంత్ కానీ అవమానకరంగా వ్యవహరిస్తే అది ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరగడానికి కారణం అవుతుంది. అందుకే కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చునని.. కానీ పాలనలో లోపాలను మాత్రంగ గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. సమయానుకూలంగా వ్యవహరించడంలో కేసీఆర్ ను మించిన వారు ఉండరు. తనదైన వాగ్ధాటితో ఎంతటి వాళ్లనైనా తన దారిలోకి తెచ్చుకోగల చాతుర్యం ఆయనకు ఉంది. ఇప్పుడు కాకపోయినా వచ్చే సమావేశాలకు అయినా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలనే అనుకుంటున్నారు. ఆయన అనుమతి లేకుండా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని .. టైగర్ వస్తుందన్న ఎలివేషన్లు ఇవ్వరు. అదే సమయంలో ఓ రోజు.. వచ్చేస్తున్నారని ప్రచారం కూడా  చేశారు.  కానీ పరిస్థితుల్ని బట్టి అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie