Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రతీకారమా… వ్యూహత్మకమా…

0

హైదరాబాద్, నవంబర్ 8

రాజకీయాలను చదరంగంతో పోల్చుతారు. చదరగంలోని 64 గడులలో మంత్రి, బంటు, ఎనుగు ఇలా సైనిక పటాలం వ్యూహాత్మకంగా కదులుతూ చివరి టార్గెట్ రాజును చేయడంతో గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో ఆయనకు చెక్ పెట్టే ప్లాన్స్ రడీ అవుతున్నాయి.తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికల్లో తొలిసారిగా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

అందులో సిట్టింగ్ స్థానం గజ్వేల్ కాగా, కొత్తగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఈదఫా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని గులాబీ నేతలు ధీమాగా చెబుతున్నారు. కొత్తగా కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్‌లోని 9 స్థానాల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరుతుందని గులాబీ తమ్ముళ్లు విశ్వసిస్తున్నారు.  కేసీఆర్ సిట్టింగ్ స్థానమైన గజ్వేల్‌లో ఆయనకు చెక్ పెట్టాలని చూస్తోన్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ను అందుకు అస్త్రంగా ప్రయోగిస్తోంది. గత ఉపఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెల్చిన ఈటల రాజేందర్, ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్ నుంచి పోటీకి కమలం పార్టీ రంగంలోకి దింపింది. ఇలా రెండు స్థానాల నుంచి పోటీ చేయడం కూడా ఈటలకు తొలిసారే.

ఒకప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలోను, ప్రభుత్వంలోను పని చేసిన ఈటల ఇప్పడు టార్గెట్ కేసీఆర్ అంటూ గజ్వేల్‌లో ఆయన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు.గజ్వేల్‌తోపాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉండటంతో అక్కడ చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఈ స్థానం నుంచి ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ పడుతుండటం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో దిగుతుండటం ఈ ఎన్నికల్లో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. కేసీఆర్‌పై పోటీకి సై అన్న ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ చీఫ్  కేసీఆర్ నుంచి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. స్వంత పార్టీలో ఉద్యమ సహచరుడిగా, మంత్రిగా ఈటల కేసీఆర్‌తో కలిసి పని చేశారు.

రాజకీయ విభేదాలు, భూ కబ్జా ఆరోపణలతో ఈటలను సాగనంపిన కారు పార్టీ  హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటలను దెబ్బకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఆ ఉపఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రతికారంగా గజ్వేల్‌లో  కేసీఆర్‌ను ఇరుకునపెట్టేందుకు బరిలో దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఓటుకు నోటు కేసులో జైలుకు పంపింది బీఆర్ఎస్ సర్కారే. అప్పటి నుంచి బీఆర్ఎస్‌పైన, కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో ఇప్పుడు బీఆర్ఎస్‌ను, తాను జైలుకెళ్లడానికి కారణమైన కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకే కామారెడ్డిలో బరిలోకి దిగడం కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలన్న వ్యూహంలో భాగమని తెలుస్తోంది.గజ్వేల్‌లో ఈటల, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో ఉండటంతో బీఆర్ఎస్ చీఫ్‌గా తను బరిలో ఉండే నియోజకవర్గాలపై మరింత ఫోకస్ పెట్టాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి సారించేలా చేస్తే, ఇతర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ తగ్గడం ఖాయమని హస్తం, కమలం నేతలు చెబుతున్నారు. ఈ వ్యూహంతోనే కేసీఆర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు పోటీ చేసే చోట గట్టి అభ్యర్థులను పెట్టి వారికి చెక్ పెట్టి సక్సెస్ అయ్యారు , ఇప్పుడు అదే వ్యూహాన్ని కేసీఆర్‌పై ఈ రెండు పార్టీలు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie