-
వివాహిత మహిళల ఈడబ్ల్యూఎస్పై విద్యాశాఖ కొర్రీ
-
తండ్రికి బదులుగా భర్త ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి
-
సంపన్న కుటుంబాల మహిళలు కోటా పొందుతున్నారంటూ ఫిర్యాదులు
మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో సర్టిఫికెట్ల పరిశీలన వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ కొత్త నిబంధన విధించడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయం ఆధారంగా జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వివాదం వెనుక కారణం ఉంది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు వివాహితులా, కాదా అనే వివరాలను పేర్కొనాల్సి వచ్చింది. చాలామంది వివాహిత మహిళలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను తమ పుట్టింటి (తండ్రి) ఆదాయం ఆధారంగానే సమర్పించారు. వివాహం తర్వాత సంపన్న కుటుంబాల్లోకి వెళ్లిన కొందరు మహిళలు కూడా ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాలు పొందుతున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
దీంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ, వివాహిత మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను (డీఈవోలు) ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం, ఒక జిల్లాలో 35 మంది అభ్యర్థులు తండ్రి పేరుతో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించారు.
వీరందరూ వెంటనే భర్త పేరుతో కొత్త సర్టిఫికెట్లు సమర్పించాలని అధికారులు సూచించారు. దాంతో అభ్యర్థులు వెంటనే మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి కొత్త ధ్రువపత్రాలను సమర్పించారు. ప్రస్తుతం ఇద్దరు మినహా మిగిలిన వారందరూ కొత్త సర్టిఫికెట్లను సమర్పించినట్లు సమాచారం. ఈ విధంగా సర్టిఫికెట్ల పరిశీలనలో తరచూ కొత్త నిబంధనలు రావడం అభ్యర్థులకు గందరగోళం కలిగిస్తోంది.
Read also : SupremeCourt : గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు కీలక విచారణ
