AP : ఏపీ పోలీసులకు హోం మంత్రి శుభవార్త.. త్వరలో కొత్త వాహనాలు, టెక్నాలజీ:పోలీస్ స్టేషన్లకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త తెలిపారు. నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆమె వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె నిన్న శంకుస్థాపన చేశారు.
శాంతిభద్రతల్లో ఏపీ దేశంలో రెండో స్థానం: హోం మంత్రి వంగలపూడి అనిత
పోలీస్ స్టేషన్లకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త తెలిపారు. నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆమె వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పోలీస్ వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని, వారికి మెరుగైన సౌకర్యాలు, సాంకేతికతను అందిస్తున్నామని తెలిపారు.
నక్కపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.2.5 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయించిన హెటిరో సంస్థ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కృషితో శాంతిభద్రతల విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానంలో నిలిపామని ఆమె గర్వంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 60,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
బస్టాండ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలు, ఇతర ముఖ్య కూడళ్లలో వీటిని అమర్చుతున్నామని, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి నేరాల నియంత్రణను మరింత సమర్థంగా నిర్వహించగలుగుతున్నామని వివరించారు. వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ, గత ఐదేళ్ల వైకాపా పాలనలో పోలీస్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి అనిత ఆరోపించారు. “మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో అన్ని పోలీస్‌స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయి” అని ఆమె అన్నారు.
Read also:Apple : ఫాక్స్‌కాన్ మరో ముందడుగు: బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం
