Sajid Akram : సిడ్నీ ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ వ్యక్తి? ఆస్ట్రేలియా పోలీసుల కీలక వెల్లడి

Sajid Akram : సిడ్నీ ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ వ్యక్తి? ఆస్ట్రేలియా పోలీసుల కీలక వెల్లడి
  • సిడ్నీ ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ వ్యక్తి?

  • ఆస్ట్రేలియా పోలీసుల కీలక వెల్లడి

Sajid Akram : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని వణికించిన సామూహిక కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడికి హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆదివారం బాండీ బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన ఈ దాడిలో 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఇద్దరిలో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో కలిసి దాడిలో పాల్గొన్న అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.

తెలంగాణ డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకాం పూర్తి చేసి, 1998 నవంబర్‌లో ఉద్యోగం కోసం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్న అతనికి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులతో పెద్దగా సంబంధాలు లేవు. చివరిసారిగా 2022లో భారత్‌కు వచ్చి వెళ్లాడు. కుటుంబ విభేదాల కారణంగా బంధువులు చాలా కాలం క్రితమే అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2017లో తండ్రి మృతి చెందినప్పుడు కూడా సాజిద్ హైదరాబాద్‌కు రాలేదని పేర్కొన్నారు. అతని రాడికలైజేషన్‌కు భారత్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న సమయంలో సాజిద్ వెనెరా గ్రోసో అనే యూరోపియన్ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియా పౌరులే కాగా, సాజిద్ మాత్రం భారత పాస్‌పోర్ట్‌నే కొనసాగిస్తున్నాడు.

ఈ దాడిపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ స్పందిస్తూ, “ఇది ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి. వయసుతో సంబంధం లేకుండా మరణాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు” అని తెలిపారు. నిందితులు ఉపయోగించిన వాహనంలో నుంచి పేలుడు పదార్థాలు, ఐసిస్ జెండాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దాడికి నెల రోజుల ముందు నిందితులు ఫిలిప్పీన్స్‌లో పర్యటించినట్లు తేలింది. నవంబర్ 1 నుంచి 28 వరకు వారు అక్కడ ఉన్నారు. సాజిద్ భారత పాస్‌పోర్ట్‌తో, నవీద్ ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్‌తో ప్రయాణించినట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు బీబీసీకి తెలిపారు. ఇస్లామిక్ గ్రూపులకు కేరాఫ్‌గా భావించే మిండనావో ద్వీపంలోని దవావో నగరాన్ని వారు సందర్శించినట్లు గుర్తించారు. ఈ పర్యటన వెనుక కారణాలపై ఆస్ట్రేలియా పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

Leave a Comment