Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణలో అలా…ఏపీలో ఇలా.

0

ఎండా కాలం వానలు తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని నిండా ముంచేశాయి. ఆరబెట్టుకున్న ధాన్యం నీళ్ల పాలయింది. కోతకు పంట నాశనం అయింది. ఎలా చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానంలో స్పష్టంగా తేడా కనిపిస్తోంది. తెలంగాణ మంత్రులు దాదాపుగా అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులకు  భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కూడా స్పందించింది. కానీ ఏపీ ప్రభుత్వంలో మాత్రం పెద్దగా కదలిక ఉండటం లేదు. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాటలు నిరాశావాదంతో ఉంటున్నాయి.

 

అధికారులు కూడా రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వలేకపోతున్నారు. కనీసం నష్టపరిహారం ఎంత ఇస్తామన్నది కూడా చెప్పలేదు. దీంతో ఏపీ రైతుల్లో దిగులు కనిపిస్తోంది. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి  ఈ  పరిహారాన్ని సీఎం కేసీఆర్ మూడు వారాల కిందట భారీగా వడగళ్ల వాన వచ్చినప్పుడే ప్రకటించారు. కానీ ఇప్పుడు మరిన్ని వర్షాలు ఎక్కువగా పడ్డాయి. మరి కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ధాన్యం తడిచిపోయింది.

 

అందుకే అందరికీ పన్నెండో తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతుకు జరిగి నష్టం  రూ. పదివేలుతో పూడిపోదు. కానీ..ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుందన్న భరోసా దక్కుతుంది. అలాగే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా కల్పిస్తున్నారు.  అదే సమయంలో ఏపీలో ఇప్పటి వరకూ పంట నష్టపోయిన రైతులకు ఇతమిత్థంగా ఇంత ఇస్తామన్న ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. పరిహారం అందలేదని ఒక్క రైతు కూడా చెప్పలేదని వారి మొహంలో చిరునవ్వు కనిపించేలా  అందరికీ పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ సమీక్షలో ఆదేశించారు.

 

కానీ ఎంత ఇవ్వాలి.. ఎప్పుడు ఇవ్వాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అండగా ఉంటే ఉండే ధైర్యం వేరు. అందుకే ఏదైనా విపత్తు జరగగానే తామున్నామంటూ ప్రభుత్వానికి చెందిన వారు వెళ్తారు. బాధితుల్లో భరోసా కల్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వ మంత్రులు అదే చేశారు. కేటీఆర్ సహా వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులందరూ రైతుల్ని పరామర్శించారు. తమది రైతు ప్రభుత్వమని ఖచ్చితంగా ఆదుకుంటామని..తడిచిన ధాన్యాన్ని కొంటామని భరోసా ఇచ్చారు. ఇది ఓ రకంగా తెలంగాణ రైతులకు నైతిక స్థైర్యం ఇచ్చింది.

 

అయితే ఏపీలో మాత్రం ఏ ఒక్క మంత్రి రైతుల్ని పరామర్శించేందుకు ఆసక్తి చూపించడం లేదు. రైతులు సంతోషంగా ఉన్నారనే ప్రకటనలు చేస్తూ ఉంటారు కానీ.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. చేతికి వచ్చిన పంట పాడైపోయింది. చేతికి రావాల్సిన పంట వస్తుందన్న గ్యారంటీలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి  దైర్యం చెప్పడానికి కూడా ఎవరూ రాలేదు. అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన అధికారులు .. సాయం చేయలేమని కావాలంటే సలహాలిస్తామని ప్రకటించడం వివాదాస్పదమయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది.

 

ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉద్యోగులకు జీతాలు, రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేకపోయారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకుని రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి విపత్తులకు ప్రజలకు సాయం చేయడానికి ఆర్థిక సమస్యలు ఉండటం వల్లనే చురుకుగా కదలడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.అయితే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే.. వేల మంది రైతులు నష్టాన్ని తప్పించుకునేవారనే వాదన ఉంది.

 

ప్రభుత్వం  ఆర్థికం కాకపోయినా.. సమయానుకూలంగా చురుకుగా వ్యవహరిస్తే.. ఎంతో నష్టం తగ్గి ఉండేదని రైతులు అంటున్నారు. కారణం ఏదైనా తెలంగాణతో పోలిస్తే ఏపీ రైతులు ఎక్కువగా నష్టపోయారు. కానీ ప్రభుత్వం మత్రం అనుకున్న విధంగా చురుకుగా స్పందించలేకపోతోంది. ఇది రైతుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణం అవుతోంది. అటు మంత్రులు.. అటు యంత్రాంగం మొత్తం అకాల వర్షాల వల్ల జరిగిన నష్టంపై యాంత్రికంగా వ్యవహరించడంతో రైతులకష్టాలు మరింత పెరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie