Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆ ఐదు నియోజకవర్గాల్లో బస్సు ఎందుకు మిస్సు

0

హైదరాబాద్, 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును లోక్ సభ ఎన్నికల్లో నిలుపుకోవాలని జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అత్యధిక స్థానాల్లో గెలిపించి తన నాయకత్వంలో ఇంకా పస తగ్గలేదని నిరూపించుకోదలచుకున్నారు. అన్ని రకాలుగా ఈ ఎన్నికలు ఆయనకు ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. ఈ గెలుపుతో తానేంటో చూపించాలని భావిస్తున్నారు. తనపైనా, నాయకత్వంపైనా, పార్టీపైనా వచ్చే విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అయితే, ఇదంతా నాణానికి ఒక వైపే. నిజానికి సర్వే రిపోర్టుల ఆధారంగా కీసీఆర్ పార్టీ రెండు స్థానాల లోపే పరిమితం అని తెలుస్తోంది. ఇక బస్సు యాత్ర షెడ్యూల్‌లో కేసీఆర్ కొన్ని నియోజకవర్గాలను టచ్ చేయడం లేదు. దీంతో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.మొదటి నుంచి అనుమానిస్తున్నట్లుగా కేసీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన మైండ్ సెట్ మార్చుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఘట్టం పూర్తి కాగానే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ లభించే సూచన కనిపిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఆ తర్వాత బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేసే ప్రక్రియ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అండ్ కో చేసిన స్కాములన్నీ కాంగ్రెస్ వెలికి తీయడంతో కేసుల భయం పట్టుకుంది. అందుకే, బీజేపీతో చేతులు కలిపితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ కు బీఆర్ఎస్ వాళ్లే దిక్కా

అందులో భాగంగానే కేసీఆర్ బీజేపీ బరిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలలో నామమాత్రపు అభ్యర్థులను బరిలోకి దింపడమేగాక, తన బస్సు యాత్ర షెడ్యూల్‌లో ఆ నియోజకవర్గాల జోలికి వెళ్లడం లేదని అంటున్నారు.తెలంగాణకు కేంద్ర బిందువైన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా మాధవీ లత, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నుంచి మహ్మద్ వలీవుల్లా సమీర్, బీఆర్ఎస్ తరపున గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. మాధవీలత తొలిసారి ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా సీటును సంపాదించుకున్నారు. కేంద్రంలో పెద్దల అండతో ఓటమి ఎరుగని అసదుద్దీన్‌ను ఢీ కొంటున్నారు. అయితే, ఆమెతో లోపాయికారీగా సహాయసహకారాలను అందించేందుకు బీఆర్ఎస్ తెర వెనుక రాజకీయం నడిపిస్తోందని అంతా అనుకుంటున్నారు. అందుకే, ఈ నియోజకవర్గం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో లేదంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం చాలా కీలకమైంది. అక్కడ గెలుపు జెండా ఎగురవేయడం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ముందే ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో నిలిచారు. త్రిముఖ పోటీ నెలకొన్న సికింద్రాబాద్లో రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఈసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. దానంను ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్న కేసీఆర్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బస్సు యాత్రలో ఈ నియోజకవర్గాన్ని టచ్ చేయడం లేదని వివరిస్తున్నారు. పైగా, మోదీకి కేసీఆర్‌కు మధ్యవర్తిత్వంగా కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారని అంటున్నారు.హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగా చాలా స్పెషల్. ఒకసారి ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన నేత, ఐదేళ్లు తిరిగేసరికి మరో పార్టీలో జంప్ చేయడం ఆనవాయితీగా మారింది. గతంలోనూ, ఇప్పుడూ ఇదే సీన్ రిపీట్ అవ్వగా ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిన వారే.

రేవంత్‌ సర్కార్‌ వేట

జంపింగ్ జపాంగ్ రాజకీయానికి కేరాఫ్‌గా మారిన నియోజకవర్గమే చేవెళ్ల. బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని సమాచారం. అందుకే కేసీఆర్ బస్సు చేవెళ్లలోనూ లేకుండా చేశారని రాజకీయ పండితులు ఆరోపిస్తున్నారు.30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి పార్లమెంట్ స్థానంపై మూడు ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుండగా, బీఆర్ఎస్ వెనుకబడింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఈ సీటును ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇక కారు పార్టీ, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. బీజేపీ ప్రధాన నేత ఈటల రాజేందర్‌ను మల్కాజిగిరి బరిలోకి దింపింది అధిష్టానం. ఇప్పటివరకు ఇక్కడ కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని.. కేసీఆర్ బస్సు ఇక్కడ ఆపంది అందుకేనని అంతా అనుకుంటున్నారు.ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు ఈసారి అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. ఆదివాసీ, లంబాడాల వైరం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆందోళనలో ఉన్నాయి పార్టీలు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఆదివాసీ అభ్యర్థులనే బరిలోకి దించాయి. తమ వర్గానికి ఏ పార్టీ సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు లంబాడాలు. ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్లు ఒక అభ్యర్థికి ఒక్కసారి అవకాశం ఇస్తే మరో దఫా మరొకరికి పట్టం కడుతున్నారు. ఎస్టీ రిజర్వుడ్గా మారిన తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా రెండోసారి గెలిచే అవకాశం దక్కలేదు. కాంగ్రెస్‌ నుంచి ఎంపీ క్యాండిడేట్‌‌గా ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావును కాకుండా బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన గొడం నగేశ్‌కు కేటాయించడంతో ఆ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు మొదటిసారి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి గోడెం నగేశ్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయంటూ జరుగుతున్న పరిణామాలను బట్టి జనం తెగ మాట్లాడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie