Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీలో పొత్తులపై ఎవరి లెక్కలు వారివి…

0

విజయవాడ, మార్చి 21 (న్యూస్ పల్స్)
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం, ఏపీలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలను అవలీలగాా కేటాయించడం వెనుక కారణాలేమిటని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ గడ్డు పరిస్థితుల్ని అధిగమించి 2024 ఎన్నికల్లో తలపడుతోంది. ఐదేళ్లలో అవమానకరమైన పరిస్థితుల్ని చంద్రబాబు చవి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల గడపనెక్కకుండా 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని నెగ్గుకొచ్చిన చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో దాదాపు రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది.అసెంబ్లీలో అవమానకరమైన పరిస్థితుల్ని చంద్రబాబు చవి చూశారు. గత ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు తెలుగు దేశం పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. గెలిచిన వారిలో నలుగురు పార్టీ ఫిరాయించారు. టీడీపీ పనైపోయిందనే ప్రచారాలను దాటుకుని చంద్రబాబు ఐదేళ్లు పార్టీని నడిపించారు.గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచిన సమయంలో చంద్రబాబు కేంద్రంలో ప్రభుత్వాలను తానే నడిపించానని పలుమార్లు స్వయంగా చెప్పుకున్నారు. 2014లో ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, 2019 నాటికి ఆ కూటమి దూరమైంది. కూటమి నుంచి బయటకు రావడంతో ఊరుకోకుండా ప్రధాని మోదీపై, బీజేపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు టీడీపీని కాపాడుకోవడమనే సవాలుతో పాటు రాజకీయాల్లో మనుగడ కొనసాగించడం, ఎన్నికల్ని ఎదుర్కోవడం కూడా ముఖ్యమయ్యాయి. 2023లో జైలు పాలైన తర్వాత చంద్రబాబుకు తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు అవగతం అయ్యాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఢీకొట్టడానికి తనకున్న బలం సరిపోదనే స్పష్టతతోనే బీజేపీకి దగ్గరైనట్టు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా బీజేపీని అంటి పెట్టుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని నిర్ణయానికి రావడంతోనే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించినట్టు స్పష్టం అవుతోంది.ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఐదేళ్లలో బీజేపీతో సయోధ్యను కొనసాగించారు. బహిరంగంగా ఎన్డీఏ కూటమిలో లేకపోయినా వైసీపీ కీలకమైన బిల్లుల విషయంలో బీజేపీ వెంట నడిచింది. సోరెన్ వంటి నేతలు మోదీని విమర్శించనపుడు బీజేపీ నేతల కంటే ముందే జగన్ ప్రధానిని సమర్ధిస్తూ ట్వీట్లు చేశారు.వైసీపీ ఉండగా టీడీపీ అవసరం ఏముందనే ఆలోచన బీజేపీలో ఉన్నా పవన్ కళ్యాణ‌ సాయంతో ఎన్నికల పొత్తును కుదుర్చుకోగలిగారు. ఈ క్రమంలో బీజేపీ కోరినన్ని పార్లమెంటు టిక్కెట్లను వదులకోడానికి కూడా చంద్రబాబు సిద్ధం అయ్యారు.ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లను దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, చేయకపోయినా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాాలను బేరీజు వేసుకుని బీజేపీతో సఖ్యతగా ఉండటమే ముఖ్యమని భావించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి బెయిల్‌పై రావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. బెయిల్‌ రద్దు కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కేసుల్ని వదిలేస్తుందనే నమ్మకం లేదు. టీడీపీ-బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో గెలిచే ఎంపీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల వైసీపీ తన జోలికి రాదనే భావన చంద్రబాబులో ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ వేధింపులకు పాల్పడకుండా రక్షణ దక్కాలంటే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే మేలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరినట్టు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie