Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పొలిటికల్ టర్న్ తీసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

0

హైదరాబాద్, ఏప్రిల్ 2
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. కేసులో అరెస్ట్ అయిన మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు పొలిటికల్ టర్న్‌ తీసుకోవడంతో త్వరలోనే బీఆర్‌ఎస్‌ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ రాజకీయ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోలీస్ వ్యవస్థలోని మూడు వింగ్‌లతో కలిసి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేశారో రాధా కిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులకు కీలక పదవులు కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

WhatsApp Updates: ఒకే ఫోన్ లో రెండు రెండు వాట్సాప్ లు

2016లో రిటైర్డ్ ఐజిని ఇంటెలిజెన్స్ డిఐజిగా నియమించారు. 2018తో పాటు 2023 ఎన్నికల్లోనూ ఆ రాజకీయ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఓ స్పెషల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఎస్ఐబి ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ విభాగాలకు సంబంధించిన పోలీసులను వాడుతూ అధిపతులు చెలరేగిపోయారు.ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు మాత్రమే పట్టుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా తెలిపారు పోలీసులు. ఎస్ఐబిలో కేవలం ప్రొఫైల్ సర్వే లైన్స్ కోసమే ప్రణీత్ రావును నియమించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు ఏ వాహనంలో వెళ్తాయనే వివరాలను హైదరాబాద్ సిటీ ట్రాన్స్‌పోర్ట్‌లో అప్పటి ఓఎస్డీగా పని చేసిన రాధా కిషన్ రావుకు చేరవేశారు. తన సిబ్బందిని వెంటనే అలర్ట్ చేస్తూ రాధా కిషన్ రావు నాడు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును 8 సార్లు సీజ్ చేశారు.

పోగొట్టుకున్న 9వేల 720 ఫోన్లు

2018 సాధారణ ఎన్నికల సమయంలో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్‌కు చెందిన 70 లక్షల రూపాయలు ఫోన్ టాపింగ్ ద్వారానే సీజ్ చేశారు2022 దుబ్బాక ఎన్నికల సమయంలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించిన డబ్బును ఈ తరహాలోనే పట్టుకున్నాట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును ఫోన్ సంభాషణలు వినే పట్టుకున్నారు. ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తమ దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకుని ఫోన్ల ద్వారా సంభాషణలు విని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేశారు. ఈ డబ్బులను సీజ్ చేసేందుకు తన దగ్గర ఉన్న ఇన్స్‌పెక్టర్లను, ఎస్ఐలను వాడారు రాధా కిషన్ రావు.మరోవైపు నాటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డబ్బును తరలించేందుకు నాటి ప్రభుత్వ పెద్దలతో కలిసి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించారు. ఇందులోనూ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేసే పలువురు ఎస్సైలను రాధా కిషన్ రావు పావుగా వాడుకున్నారు. ఆయన చెప్పినట్టు చేసిన సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా రాధా కిషన్ రావును కస్టడీకి తీసుకొని విచారణ జరపనున్నారు పోలీసులు.ట్యాపింగ్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులను తమ టీం సభ్యులుగా చేసుకున్నారు నిందితులు. ఇందులో భాగంగా తిరుపతన్న, భుజంగరావు, రాధా కిషన్ రావు, వేణుగోపాలరావు, ప్రణీత్ రావు… తదితరులకు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ శాఖల్లో కీలక పోస్టింగులు కల్పించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ఫోన్లను, రెబల్స్‌గా ఉన్న నేతల ఫోన్లను, ఇతర పార్టీల నుంచి అధికార పార్టీకి రావాలనుకుంటున్న నేతల ఫోన్ లను, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా నిఘా పెట్టించి ఫోన్లను ట్యాప్‌ చేయించారు. మొత్తం పొలిటికల్ వ్యవస్థను టెక్నికల్ గా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ట్యాపింగ్ బ్యాచ్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని అనేకమంది నేతలు ఆరోపించారు.ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు స్పెషల్ టీం పోలీసులు. ప్రణీత్ రావ్, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావు లను నిందితులుగా చేర్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో రిటైర్డ్ ఐజీ కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారు. వీరిచ్చే వాంగ్మూలాల ఆధారంగా బీఆర్‌ఎస్‌ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie