సంక్షిప్త వార్తలు:05-02-2025:హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులకు, బ్యాంకులకు ఆయన ఆదేశించారు. ప్రాసెసింగ్లో ఉన్నవారి వివరాలు, ఇప్పటికే సాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినవి,
హైదరాబాద్లో ముద్ర రుణాల మంజూరు ప్రక్రియపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరా
హైదరాబాద్
హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులకు, బ్యాంకులకు ఆయన ఆదేశించారు. ప్రాసెసింగ్లో ఉన్నవారి వివరాలు, ఇప్పటికే సాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినవి, అలాగే బ్యాంకుల నుంచి అప్రూవల్ పొందిన దరఖాస్తుల సంఖ్య లాంటి విషయాలన్నీ స్పష్టంగా పొందుపరిచిన పూర్తి లిస్టును తయారుచేయాలని కేంద్రమంత్రి ఆదేశాలు జారీ చేశారు
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
ధర్మాసనం కీలక ఆదేశాలు

వైసీపీ కీలక నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని, తనను తాడిపత్రికి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.
సురేష్ ప్రొడక్షన్స్‌కు సుప్రీంలో దక్కని ఊరట
విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఫిల్మ్‌సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్‌కు అనుమతించింది. ఈక్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈక్రమంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. మరోవైపు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ కోరగా ధర్మాసనం అనుమతించింది.
“చంద్రభాగ” పుస్తకాన్ని ఆవిష్కరించిన
మంత్రి జూపల్లి కృష్ణారావు

సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు రవీంద్ర భారతి ప్రాంగణంలోని వారి చాంబర్ లో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల కథల అనువాద సంకలనం “చంద్రభాగ” కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ కవి, అనువాద రచయిత, డాక్టర్ రూప్ కుమార్ డబ్బికార్ అనువదించిన ఈ కథలు భారతీయ కథా సాహిత్యానికి దర్పణం పడుతుందని, ఇలాంటి గ్రంథాలను ముద్రించి వెలుగులోకి తెస్తూ విశేషమైన సాహిత్య కృషి చేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారిని, అలాగే గ్రంథ రచయిత డాక్టర్ రూప్ కుమార్ డబ్బికార్ ను మంత్రివర్యులు అభినందించారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన “తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి” పుస్తకాన్ని మంత్రి గారికి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు సోమశిల తిరుపాల్, తంగిరాల చక్రవర్తి, అనంతరాజు మోహన్ కృష్ణ, తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.
