- ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికయ్యింది – తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్
హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో బుధవారం యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్ 2025 ఘనంగా ముగిసింది. ఫైనల్లో జోగులాంబ లయన్స్ అద్భుత ప్రతిభను ప్రదర్శించి, భద్రాద్రి బ్రేవ్స్‌ను 35-21 తేడాతో ఓడించి విజేతలుగా నిలిచాయి.
సూఠపర్ 4 దశలో ఉత్కం పోరు
ఫైనల్‌కు ముందు సూపర్ 4 దశలో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి.
-
మొదటి మ్యాచ్: యాదాద్రి యోధులు, బసర విద్యుత్‌పై 66-45 తేడాతో గెలిచారు. రైడింగ్, డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చాటిన యోధులు, ఫైనల్‌కు చేరుకోకపోయినా తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించారు. మరోవైపు వరుస పరాజయాలతో విద్యుత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.
-
చివరి మ్యాచ్: భద్రాద్రి బ్రేవ్స్, జోగులాంబ లయన్స్‌పై 45-44 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని సాధించాయి. చివర్లో వచ్చిన ఆల్ అవుట్ వారికి కొద్దిపాటి తేడాతో గెలుపు తీసుకువచ్చింది.
టైటిల్ పోరులో లయన్స్ దూకుడు
ఫైనల్లో మాత్రం లయన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కెప్టెన్ జి. రాజు 12 రైడ్ పాయింట్లతో మెరిశాడు. ఆకుల నవీన్ ఎనిమిది టాకిల్ పాయింట్లతో రక్షణ బలపరిచాడు. సమన్వయంతో ఆడిన లయన్స్, బ్రేవ్స్‌ను పూర్తిగా చిత్తు చేశాయి. పూర్వపు ఫాం కొనసాగించలేకపోయిన బ్రేవ్స్, చివరికి 35-21 తేడాతో ఓటమి చెందగా, లయన్స్ యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్ 2025 ట్రోఫీని లిఫ్ట్ చేశాయి.
కొత్త ప్రతిభలకు వేదిక
టోర్నమెంట్ విజయవంతం సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ” ఈ ఛాంపియన్‌షిప్ మరోసారి యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదికగా నిలిచింది. గ్రామీణ స్థాయిలో కబడ్డీ ఆడుతున్న అనేక ప్రతిభావంతులు ఇలాంటి పోటీల ద్వారా వెలుగులోకి వస్తున్నారు. గ్రామీణ పాఠశాలలు, చిన్న మైదానాల నుంచి వచ్చిన ఆటగాళ్లు ఇప్పుడు ప్రొఫెషనల్ స్థాయికి చేరువ అవుతున్నారు. ఇది తెలంగాణ కబడ్డీకి గర్వకారణం” అన్నారు.
అదేవిధంగా, “యువ తెలంగాణ, యువ ఆంధ్ర టోర్నమెంట్‌లలో మెరిసిన ఆటగాళ్లకు తెలుగు కబడ్డీ లీగ్ తలుపులు తెరిచింది. ఇది వారికి గుర్తింపే కాకుండా ఆర్థిక స్థిరత్వం, ప్రొఫెషనల్ కెరీర్ వైపు అడుగులు వేయడానికి తోడ్పడుతుంది. కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదు, క్రమశిక్షణ, ధైర్యం, జట్టు స్పూర్తి కలిపిన క్రీడ. ఈ టోర్నమెంట్ ద్వారా రాష్ట్రం నుంచి ప్రతిభావంతులు బయటకు రావడం, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం పొందడం ఖాయం. తెలంగాణలో కబడ్డీకి కొత్త యుగం ప్రారంభమైంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, పలువురు కోచులు, కబడ్డీ సీనియర్లు, కాంగ్రెస్ నాయకులు, మెదక్ జిల్లా నేత పుట్టి రాజు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Read : Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
