Telangana : ఆర్టీసీ బస్సులో ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి భారీగా నష్టం: రూ. 6.15 లక్షలు మాయం

Cyber Shock: Passenger's Bank Account Drained of Rs 6.15 Lakh After Losing Phone on Bus
  • బోయినపల్లి బస్టాప్‌లో ప్రయాణికుడి ఫోన్ చోరీ
  • రెండు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ
  • కొత్త సిమ్ వాడటంలో ఆలస్యమే కారణమన్న పోలీసులు

హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో పోయిన సెల్‌ఫోన్ ఓ ప్రయాణికుడికి తీరని నష్టాన్ని కలిగించింది. కేవలం ఫోన్ మాత్రమే కాదు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 6.15 లక్షలు మాయం కావడంతో బాధితుడు నిస్సహాయంగా రోదిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్‌లో నాందేడ్‌కు వెళ్లే బస్సు ఎక్కారు. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గమనించారు. వెంటనే అప్రమత్తమై బోధన్‌కు చేరుకున్న తర్వాత పాత నంబర్‌ను బ్లాక్ చేయించి, అదే నంబర్‌పై కొత్త సిమ్‌కార్డు తీసుకున్నారు. అయితే, అప్పటికప్పుడు కొత్త ఫోన్ లేకపోవడంతో ఆ సిమ్‌ను వెంటనే వాడలేదు.

ఇదే అదనుగా భావించిన దొంగ, దొరికిన ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి ప్రసాదరావుకు చెందిన కెనరా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షలు, మరో సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 2.15 లక్షలు, మొత్తం రూ. 6.15 లక్షలు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈ నెల 6వ తేదీన ప్రసాదరావు కొత్త ఫోన్ కొనుగోలు చేసి, అందులో తన సిమ్ వేయగా అసలు విషయం బయటపడింది. తన అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌లు చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు.

వెంటనే తేరుకుని నిన్న బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు కొత్త సిమ్ తీసుకున్నప్పటికీ, దాన్ని వెంటనే వాడకపోవడం వల్లే నిందితుడికి ఈ లావాదేవీలు జరిపేందుకు సమయం దొరికిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also : Sharwanand : శర్వానంద్ కొత్త ప్రయాణం: ‘ఓమీ’ నిర్మాణ సంస్థ ప్రారంభం

 

Related posts

Leave a Comment