Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ములుగులో సీతక్క వ్యూహ రచన

0

వరంగల్, జనవరి 30, 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణలోని ములుగులో ఇప్పటినుంచే ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఆ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అధికార బీఆర్ ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ములుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతక్క వచ్చే ఎన్నికల్లోనూ తన పదవిని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. దీంతో ములుగులో ముక్కోణపు పోటీ తప్పేట్లు లేదు. ములుగు నియోజకవర్గంలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ములుగు నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల 2వేల మందితో జరిగిన బూత్ స్థాయి సమావేశంలో పార్టీ బలపడినట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు.

ఇంకోవైపు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఉన్న ధనసరి అనసూయ (సీతక్క) నిత్యం ప్రజలతో మమేకమవుతూ వస్తోంది. ములుగు ఎస్టీ రిజర్వు నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి, దివంగత నేత అజ్మీర చందూలాల్ ఎమ్మెల్యేగా గెలుపొంది గిరిజన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి అయ్యారు. చందూలాల్ తదనంతరం ఆయన కుమారుడు అజ్మీర ప్రహ్లాద్ ఒంటెద్దు పోకడలతో 2018 ఎన్నికల్లో సీతక్క పై ఓటమి పాలయ్యారు. ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా, నాయకపోడ్, ఎరుకుల, కోయ, గోండు కుల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ కులాల వారిని దనసరి అనసూయ (సీతక్క) గత ఎన్నికల్లో ఓటర్లుగా మార్చుకోవడంలో సఫలీకృతమై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్థుతం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే కోసం అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది.

మాజీ ఎంపీ సీతారాం నాయక్, ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ తోపాటు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదేవిధంగా ఆదివాసీ తెగకు చెందిన జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, పొడెం కృష్ణప్రసాద్, మైపతి అరుణ్ కుమార్, మాజీ మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీర ప్రహ్లాద్, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సిద్ధబోయిన లక్ష్మన్ రావు, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య ములుగు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రేస్ పార్టీ నుంచి గెలుపొందిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీఆర్ ఎస్ నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తన పుట్టినరోజు కానుకగా ములుగును జిల్లాగా ప్రకటించారు. దీంతో 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లా ఏర్పాటయ్యింది.

ఆ సందర్భంగా సీఎం జిల్లాను అభివృద్ధి చేస్తామని ములుగు ప్రజలకు మాటిచ్చారు. పలు హామీలను గుప్పించారు. అయితే అక్కడ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. బస్ డిపో, క్రీడా మైదానం ఏర్పాటు లేదు. . గోదావరి నదికి కరకట్ట నిర్మాణం పెండింగ్ లోనే ఉంది. మల్లంపల్లి గ్రామంతోపాటు మంగపేట మండలంలోని రాజుపేట గ్రామాలను మండలాలుగా చేస్తామని మాట ఇచ్చి తప్పటంతో అక్కడి జనం బీఆర్ఎస్ పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు. ములుగు జిల్లా కేంద్రం పట్టణీకరణ జరగడంలేదు. డ్రైనేజీ సమస్య తీరలేదు. జిల్లా కేంద్రం అయినప్పటికీ శాశ్వత శ్మశానవాటిక లేదు. పట్టణ విస్తరణకు ప్లానింగ్ లేదు. గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించడంలేదు. కేంద్రీయ విద్యాలయం, స్పోర్ట్స్ స్కూల్ ప్రతిపాదనలకే పరిమితం అయ్యింది. ములుగులో ఎప్పటికైనా అధికారం చేపట్టాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం సూచనలు పాటిస్తూ పార్టీని పటిష్ట పరిచేందుకు కిందిస్థాయి నేతలు చర్యలు తీసుకుంటున్నారు.

ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకుగాను బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో బంజారా సామాజికవర్గానికి చెందిన భూక్య రాజు నాయక్, భూక్య జవహర్ లాల్, ఆదివాసీ నాయకుడు తాటి కృష్ణ ఉన్నారు. అయితే బీజేపీ నుంచి ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకున్ని రంగంలోకి దించేలా పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావును ఎమ్మెల్యే అభ్యర్ధిగా రంగలోకి దింపే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి తన పదవిని నిలబెట్టుకునేందుకు తెలివిగా పావులు కదుపుతున్నారు. శాసన సభ్యురాలిగా ఎన్నికైనప్పటినుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు వింటూ పరిష్కారాలు సూచిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆమె చేస్తున్న పనులు, కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరలవుతూ ఉంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie