Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎన్నికల విధులకు వలంటీర్ల దూరం

0

విజయవాడ, మార్చి 16 (న్యూస్ పల్స్)
రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు వారిని పూర్తిగా దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి వారిని తక్షణమే తొలగించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగానూ నియమించవద్దని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఈసీ మార్గదర్శకాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ పంపించారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న సీఈసీ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమొక్రసీ  చేసిన విజ్ఞప్తిపై తగు నిర్ణయం తీసుకోవాలని సీఈసీని హైకోర్టు ఆదేశించింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంచాలన్న ఉత్తర్వులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సీఎఫ్ డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

దీనిపై విచారించిన ధర్మాసనం 3 వారాల్లో తగు నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలిచ్చింది.ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఉపయోగించవద్దని.. వారిని పోలింగ్ ఏజెంట్లుగా సైతం అనుమతించొద్దని గతంలోనే సీఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా బీఎల్‌వో (లుగా పనిచేసిన సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీ సూచించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహించుకోవచ్చునని పేర్కొంటూ.. ఎన్నికల విధుల్లో వారి పాత్రపై క్లారిటీ ఇచ్చింది. సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు అప్పగించవచ్చునని స్పష్టం చేసింది. వీటికి అదనంగా మరే ఎన్నికల విధులను వారికి అప్పగించకూడదని ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సూచించింది. వాలంటీర్ల విషయంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. ఈసీ ఆదేశాలు సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాల నుంచి సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు వాలంటీర్లను ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు, నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లుబాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రాష్ట్రాల వారీగా సీఈసీ సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలిచ్చింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie