Andhra Pradesh : జిఎస్టీ పన్నులు లేవు, తరుగు ఉండదు.. కారుచౌకగా ఆభరణాలు అని ప్రచారం చేస్తే ఎవరైనా ఎగబడకుండా ఉంటారా… సరిగ్గా ఈ బలహీనత మీదే విజయవాడలో జీరో బిజినెస్ గోల్డ్ దందా నడుస్తోంది. తక్కువ ధరకు బంగారం వస్తుందనే ఆశపడితే అసలు బంగారానికే ఎసరు పెడుతున్నారు. బెజవాడలో బంగారం కొనే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించి కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
జీరో గోల్డ్ బిజినెస్ తో
నయా దందా
విజయవాడ, మే 16
జిఎస్టీ పన్నులు లేవు, తరుగు ఉండదు.. కారుచౌకగా ఆభరణాలు అని ప్రచారం చేస్తే ఎవరైనా ఎగబడకుండా ఉంటారా… సరిగ్గా ఈ బలహీనత మీదే విజయవాడలో జీరో బిజినెస్ గోల్డ్ దందా నడుస్తోంది. తక్కువ ధరకు బంగారం వస్తుందనే ఆశపడితే అసలు బంగారానికే ఎసరు పెడుతున్నారు. బెజవాడలో బంగారం కొనే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించి కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జిఎస్టీ లేకుండా తరుగు తక్కువకు బంగారం తక్కువ ధరకు లభిస్తుందని కక్కుర్తి పడితే నిలువునా ముంచేస్తారు. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ మోసాలపై ప్రభుత్వ యంత్రాంగాలు కూడా దృష్టి పెట్టడం లేదు.బంగారం అమ్మకాల్లో వ్యాపారులు రకరకాల లెక్కలు చెప్పి ఆభరణాలకు ధరలు నిర్ణయిస్తుంటాయి. వీటి హేతుబద్దత గురించి సరైన నిర్వచనాలు మాత్రం ఉండవు.బడా షోరూమ్‌లలో ఆభరణాలను కొనుగోలు చేస్తే తరుగు, మజూరీ, జిఎస్టీ పేరుతో కొంత అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో విజయవాడ హోల్ సేల్ మార్కెట్లలో కొత్త దందా నడుస్తోంది.బంగారు ఆభరణాల విక్రయాల్లో విజయవాడ గవర్నర్‌పేట మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. జైహింద్ మార్కెట్లో ఉండే బంగారు దుకాణాల్లో గుట్టలుగుట్టలుగా ఆభరణాలను విక్రయిస్తుంటారు.
షోరూమ్‌లలో ఉండే డిజైన్ల కంటే వందల సంఖ్యలో ఎక్కువగా ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు ఆభరణాలపై పెట్టుబడి పెట్టే వారు హోల్‌సేల్ బంగారు ఆభరణాల దుకాణాల్లో నగలను కొనుగోలు చేస్తుంటారు. ఈ దుకాణాల్లో నిత్యం కోట్లలో టర్నోవర్ జరుగుతుంది.విజయవాడలో బంగారం కొనేటపుడు కాస్త ముందు వెనుక ఆలోచించి కోవాలి. కార్పొరేట్ షోరూమ్‌ల మాదిరి తాము పన్నులు వసూలు చేయమని స్థానిక వ్యాపారులు ప్రచారం చేసుకోవడంతో ఈ దుకాణాల్లో కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి.విజయవాడకు చెందిన ఓ మహిళ ఇటీవల జైహింద్ కాంప్లెక్స్ హోల్‌సేల్ ఆభరణాల దుకాణంలో సుమారు రూ.5లక్షల ఖరీదు చేసే ఆభరణాన్ని కొనుగోలు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆభరణంపై రుణం తీసుకునేందుకు బ్యాంకును సంప్రదించడంతో దాని విలువ మూడు లక్షలకు మించదని తేల్చడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో దుకాణదారుడిని ప్రశ్నిస్తే కొనుగోలు చేసిన ఆభరణంలో రాళ్ల బరువు మినహాయిస్తే బంగారం బరువు అంతే ఉంటుందని నింపాదిగా చెప్పారు.52 గ్రాముల బరువు ఉన్న ఆభరణానికి రూ.4.94లక్షల ధరగా నిర్ణయించి, బేరసారాల తర్వాత మహిళకు రూ.4.70 లక్షలకు విక్రయించారు.
ఆభరణాన్ని విక్రయించే సమయంలో 52.5 గ్రాముల బరువుకు రూ.9వేల చొప్పున ధర వసూలు చేశారు. బ్యాంకులో ఆభరణం విలువను లెక్కించే సమయంలో ఆభరణంలో దాదాపు 13 గ్రాములు రాళ్ల బరువు ఉన్నట్టు అప్రైజర్ తేల్చాడు. బంగారు ఆభరణంలో ఉన్న 9 పెద్ద పూసలు ఒక్కోటి 0.750 మిల్లీ గ్రాములు, మిగిలిన రాళ్లు కలిపి 12 నుంచి 13 గ్రాముల బరువు ఉంటాయని ఆభరణం అసలు బరువు 38 గ్రాముల్లోపు ఉంటుందని లెక్కించాడు.ఈ వ్యవహారంలో 13 గ్రాముల రాళ్ల బరువుకు కూడా రూ.9వేల చొప్పున బంగారం ధరను వసూలు చేసిన దుకాణదారుడు వారికి జిఎస్టీ రూపంలో లబ్ది కలిగించినట్టు నమ్మించాడు. తాను తరుగు రెండు శాతం లోపు మాత్రమే తీసుకున్నామని చెప్పాడు. కొనుగోలు చేసిన ఆభరణం అసలు బరువు లెక్క మాత్రం చెప్పలేదు. బ్యాంకు లెక్కలో 38గ్రాములు మాత్రమే బరువు తేలడంతో హోల్‌సేల్ లెక్క తేల్చాలని బాధితులు దుకాణం యజమానిని ప్రశ్నించారుబంగారు ఆభరణాల తయారీలో తరుగు 18శాతం వరకు ఉంటుందని, మేకింగ్ ఛార్జీలు, డిజైనింగ్ ఛార్జీలు, జిఎస్టీతో పాటు రాళ్ల బరువు క్యారెట్లలో లెక్కించినా తాము హోల్‌సేల్‌గా విక్రయించిన ధర కంటే ఎక్కువే అవుతుందని నమ్మించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆభరణాల్లో రాళ్ల బరువును విడిగా లెక్కిస్తారని సాధారణ రంగురాళ్లకు బంగారంతో సమానంగా ధర వసూలు చేయరని ప్రముఖ దుకాణాలు స్పష్టత ఇచ్చాయి. ఈ క్రమంలో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నిరాకరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.రాళ్ల బరువుతో కలిపి ఆభరణం విలువను లెక్కించడం, హోల్‌సేల్ పేరుతో ఆభరణంలో బంగారం బరువును లెక్కలో చూపకుండా రాళ్ల బరువుతో కలిపి మొత్తం బరువును లెక్కించడంపై పోలీసులు దుకాణదారుడిని ప్రశ్నించడంతో దుకాణదారుడు వివాదాన్ని ముగిస్తామని దారికొచ్చారు. కొనుగోలు చేసిన సొమ్మును వాపసు చేస్తామని చెప్పడంతో వివాదం ముగిసింది.బంగారు ఆభరణాల కొనుగోలులో ధరల విషయంలో నాలుగైదు చోట్ల విచారించడంతో పాటు ధరను లెక్కించే సమయంలో ఆభరణాల్లో రాళ్ల బరువును విడిగా తెలుసుకోక పోతే నిండా మునుగుతారు. నిత్యం కోట్లాది రుపాయలు లావాదేవీలు జరిగే చోట జిఎస్టీలు, బిల్లులు లేకుండా ఆభరణాల విక్రయాలు యథేచ్ఛగా జరగడం సందేహాలకు తావిస్తోంది.లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ టాక్సెస్ వంటి ప్రభుత్వ శాఖలకు తెలిసే నగరంలో ఈ జీరో బిజినెస్ గోల్డ్ దందా సాగుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైనా బాధితులు మోసాలను గుర్తించినపుడు వారి డబ్బు వెనక్కి ఇచ్చేసి గుట్టుగా సెటిల్ చేసుకుంటున్నారు.సాధారణ రంగు రాళ్లకు బంగారంతో సమానంగా ధర వసూలు చేయడం, అదే ఆభరణం బరువుగా నిర్దారిస్తూ వాటికి సర్టిఫికెట్లను సైతం జారీ చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read more:Andhra Pradesh : కేంద్ర సంస్థల పనులు ఎప్పుడు.. 41 సంస్థలు..300 ఎకరాలు
