Hyderabad : హైదరాబాద్‌లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి… రూ.15 వేల కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

HYDRA Demolishes Illegal Ventures on 317 Acres of Government Land in Gajularamaram
  • గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

  • స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు రూ.15 వేల కోట్లు

  • ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు, రియల్టర్లు, అధికారుల హస్తం

హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, గాజులరామారంలో దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, కొందరు ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న ఈ అక్రమాలకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అడ్డుకట్ట వేసింది.

గత ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా లోతైన విచారణ జరిపింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంది. గాజులరామారంలోని సర్వే నంబర్ 307 సహా ఇతర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను, లేఅవుట్లను అధికారులు పూర్తిగా కూల్చివేశారు. అక్రమంగా వేసిన రోడ్లు, విద్యుత్ కనెక్షన్లను తొలగించారు.

అక్రమాల తీరు ఇలా ఉంది:

ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన ఈ భూములను, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకంలో జరిగిన జాప్యాన్ని కొందరు ఆసరాగా తీసుకుని కబ్జా చేశారు. ప్రగతినగర్ వైపు బడా నాయకులు, రియల్టర్లు భారీ వెంచర్లు వేయగా, మరోవైపు స్థానిక నాయకులు, రౌడీషీటర్లు పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. 60, 120 గజాల ప్లాట్లుగా విభజించి, వాటిలో చిన్న గదులు నిర్మించి, కుటుంబాలను అద్దె లేకుండా ఉంచి, ఆ తర్వాత అమాయకులకు విక్రయించినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఈ దందాలో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న షేక్ అబీద్ వంటి అనేక మంది పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు.

కూల్చివేతల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడ నివసిస్తున్న పేదలకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్రమంగా బోర్డులు పెట్టి ప్లాట్లు అమ్ముతున్న వారే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. స్వాధీనం చేసుకున్న 317 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసే పనులను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.

Read also : ShamshabadAirport : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

 

Related posts

Leave a Comment