Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పొంగులేటి కోసం 3 పార్టీలు…

0

ఖమ్మం, ఫిబ్రవరి 1,
రాష్ట్రంలో విపక్షాలన్నీ స్టేట్ పాలిటిక్స్ తో పాటు.. ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. బీఆర్ఎస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూపంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని… ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పై దండయాత్ర చేస్తానంటున్న పొంగులేటిని… తమ గూటికి తెచ్చుకుంటే ఖమ్మంలో తిరుగుండదని భావిస్తున్నాయి. ఈ మేరకు.. బీజేపీ, కాంగ్రెస్ .. మాజీ ఎంపీని తమ టీంలో చేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా… ఖమ్మం జిల్లాపైనే ప్రత్యేక దృష్టి సారించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ… తాజాగా రేసులోకి వచ్చింది. గతంలో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన పొంగులేటిని… ఇప్పుడు వైఎస్సార్టీపీలోకి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో…. ప్రత్యామ్నాయం కోసం చూస్తోన్న శ్రీనివాస్ రెడ్డి ముందు…. ఇప్పుడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి.2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో పొంగులేటి విజయం సాధించారు.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారు. వీరంతా పొంగులేటితో కలిసి బీఆర్ఎస్ చేరారు. అప్పటి నుంచి జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటికి.. 2019లో గులాబీ బాస్.. టికెట్ నిరాకరించారు. ఎలాంటి పదవీ కట్టబెట్టలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితోనే కొనసాగుతూ వచ్చారు. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… అప్రమత్తమైన ఆయన… ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీలో ఉంటానని బీఆర్ఎస్ బాస్ కి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అలాగే.. పినపాక, సత్తుపల్లి, వైరా, ఆశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో తన అనుచరులకి సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే… కేసీఆర్ నుంచి ఈ విషయమై ఎలాంటి స్పందన రాకపోవడంతో… పొంగులేటి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే… పలుమార్లు బహిరంగ వేదికపై బీఆర్ఎస్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గులాబీ బాస్ పైనే పరోక్షంగా కౌంటర్ లు వేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో… అందరి కంటే ముందుగా.. బీజేపీ అలర్ట్ అయింది. కేసీఆర్ పై అలిగిన పొంగులేటిని కాషాయ శిబిరంలోకి ఆహ్వానించింది. ఈ క్రమంలో.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని…. జనవరి 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తున్నారని… అదే రోజు పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై పొంగులేటి నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. కొంత ఆలస్యమైనా… కమలం గూటికి చేరడం గ్యారెంటి అనే చర్చ సాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకి సీట్లు ఇవ్వాలని పొంగులేటి చెప్పగా… అందుకు బీజేపీ సైతం అంగీకరించినట్లు సమాచారం. అయితే.. ఏమైందో ఏమో కానీ… బీజేపీలో చేరడంపై పొంగులేటి మళ్లీ ఆలోచనలో పడ్డారనే ప్రచారం ఊపందుకుంది. కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

బీజేపీ నావలో ప్రయాణించి ఆశించిన స్థాయిలో విజయం సాధించగలమా ? అనే అంశంపై లోలోపల అంతర్మథనం చెందుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ టైం గ్యాప్ లోనే పొంగులేటిని తమవైపు రప్పించేందుకు కాంగ్రెస్ రెడీ అయిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక లీడర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క… పార్టీలో చేరాలంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా… పొంగులేటి వస్తే బాగుంటుందని.. బీజేపీ కంటే ఖమ్మంలో కాంగ్రెస్సే బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో… పొంగులేటి హస్తం గూటికి చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు… కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పొంగులేటి వస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ విషయంలో… పొంగులేటి నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు. కారణం… అనుచరుల సీట్లపై గ్యారెంటీ లభించకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరితే ఆయనకు కోరిన చోట సీటు ఇవ్వడానికి హస్తం నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అయితే… ఆయనతో పాటు అనుచరులకు ఇవ్వాలంటే మాత్రం కష్టమే అన్న భావన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఈ విషయంలోనూ పొంగులేటి ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ సాగుతోంది.ఈ క్రమంలో.. ప్రత్యామ్నాయం కోసం చూస్తోన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని తమ పార్టీలోకి ఆహ్వానించింది.. వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పొంగులేటి సమావేశమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒక రహస్య ప్రాంతంలో సుమారు గంట పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా… పార్టీలో చేరాలని వైఎస్ షర్మిల… పొంగులేటిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో… ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. వైఎస్ఆర్ అభిమాని అయిన పొంగులేటి… గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపారు. ఈ నేపథ్యంలోనే…. ఆయన పార్టీలోకి వస్తే ఖమ్మంలో వైఎస్సార్టీపీ మరింత బలపడుతుందన్న ఉద్దేశంతో… వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పైగా.. కోరిన చోట్ల ఆయన అనుచరులకు టికెట్లు ఇచ్చేందుకు కూడా షర్మిల సుముఖంగా ఉన్నట్లు సమాచారం.మొత్తంగా ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిన వేళ పొంగులేటి అడుగులు ఎటువైపు వేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీల ప్రయత్నాల నేపథ్యంలో….. ఫైనల్ గా ఏం జరుగుతుందనేది చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie