KTR : జూరాల తర్వాత మంజీరాకు ప్రమాదం? కాంగ్రెస్ వైఫల్యంపై కేటీఆర్ ఆగ్రహం

KTR Accuses CM Revanth Reddy of Destroying Irrigation Projects

KTR : జూరాల తర్వాత మంజీరాకు ప్రమాదం? కాంగ్రెస్ వైఫల్యంపై కేటీఆర్ ఆగ్రహం:BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే, హైదరాబాద్ జంట నగరాలకు నీటిని సరఫరా చేసే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు.

మంజీరాకు కేటీఆర్ హెచ్చరికలు: కాంగ్రెస్ నిర్లక్ష్యంపై నిప్పులు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే, హైదరాబాద్ జంట నగరాలకు నీటిని సరఫరా చేసే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ అసమర్థత వల్లే నిన్న నెట్టెంపాడుకు, నేడు మంజీరాకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయని ఆయన అన్నారు.

గత మార్చి 22న స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (SDSO) నిపుణుల బృందం మంజీరా బ్యారేజీని పరిశీలించి, దాని భద్రతపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ నివేదికను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు. ఊహించని వరద ప్రవాహం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, మంజీరా బ్యారేజీపై కూడా వరద ఒత్తిడి పెరిగి పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, ఆప్రాన్ కొట్టుకుపోయిందని, స్పిల్‌వే దెబ్బతిన్నదని SDSO నివేదిక స్పష్టంగా హెచ్చరించినా ముఖ్యమంత్రి నిద్రమత్తు వీడకపోవడం దారుణమని కేటీఆర్ విమర్శించారు.

NDSA నివేదిక ఇచ్చినా మేడిగడ్డ మరమ్మతులు చేపట్టకపోవడం, ఇప్పుడు SDSO హెచ్చరించినా మంజీరాను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, దుర్మార్గపు వైఖరికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. “మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్ల పగుళ్లపై నానా యాగీ చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. ఇప్పుడు మంజీరా పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం” అని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులపై కక్ష గట్టి, చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

రానున్న రోజుల్లో ఎగువ నుంచి మంజీరాలోకి వరద ఉద్ధృతి పెరిగితే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతో కాలం గడుపుతూ తాగు, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని కేటీఆర్ హెచ్చరించారు. ఆయన తన ప్రకటనను ‘జై తెలంగాణ’ అని ముగించారు.

Read also:Telangana : తెలంగాణ ఈఏపీసెట్ 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!

 

Related posts

Leave a Comment