-
గత ప్రభుత్వ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం
Chandrababu : రాష్ట్రంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించనున్న వైద్య కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పీపీపీ పద్ధతిలో నిర్మించినప్పటికీ, అవి ప్రభుత్వ వైద్య కళాశాలల పేరుతోనే కొనసాగుతాయని, వాటికి సంబంధించిన నిబంధనలు, నియమాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పీపీపీ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన సేవలు అందించవచ్చన్నారు. “రోడ్లను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే అవి ప్రైవేటు ఆస్తులవుతాయా? కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులను ఇదే విధానంలో అమలు చేస్తోంది. ఈ వైద్య కళాశాలల్లో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి” అని వివరించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని, విమర్శలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ నిర్మించి నిధులను వృథా చేశారు. ఆ మొత్తంతో రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చు. ఇప్పుడు ఆ భవనం ఒక ‘వైట్ ఎలిఫెంట్’గా మారింది” అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం అధిక వడ్డీలతో అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నామని, స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Read : ChandrababuNaidu : నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో 15 ఏళ్ల సీఎం పదవీకాలం – ఒక చారిత్రక ఘట్టం
