Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైసీపీకి ఎందుకు తడబాటు.

0

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ బీజేపీపై విమర్శలు చేయలేదు. ఢిల్లీలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తోంది. అంతే కాదు బీజేపీకి సహకరించలేదని  ఇతర పార్టీలపై సీఎం జగన్ రెండు సార్లు  హితవులు చెబుతూ ట్వీట్లు కూడా చేశారు. కానీ బీజేపీ మాత్రం ఏపీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతి మయమని.. సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో వైఎస్ఆర్సీపీ తడబడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ విమర్శలకూ టీడీపీనే కారణం అని చెబుతూండటమే దీనికి కారణం.

 

అమిత్ షా, జేపీ నడ్డాలు స్వతహాగా తమను విమర్శించలేదని ఇదంతా టీడీపీ కుట్ర  అని చివరికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఓ వాదనను తెరపైకి తీసుకు వచ్చి వాదించడం ప్రారంభించారు. కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో పెద్దగా కనిపించని విజయసాయిరెడ్డి హఠాత్తుగా  మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సైలెన్స్ కు తెర దించారు. అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు టీడీపీ కోవర్టులపనేనన్నట్లుగా ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి మూడున్నరేళ్ల క్రితం సుజనా చౌదరి, సీఎం రమేష్ , టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలు బీజేపీలో చేరారు.

 

నిజానికి వారు అప్పుడు రాజ్యసభ సభ్యులు. ఈ మధ్య కాలంలో వారి పదవీ కాలం పూర్తయింది. ఎవరికీ మరోసారి చాన్స్ దక్కలేదు. అలాగని బీజేపీలో కీలక పదవులు కూడా ఏమీ లేవు. సీనియర్ నేతలుగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో వారి పాత్ర కూడా పెద్దగా ప్రస్తావనకు రాలేదు.కానీ.. వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం బీజేపీ..  తమకు వ్యతిరేకంగా ఏం చేసినా వీరి పనేనని వాదిస్తూ వస్తున్నారు. వీరందర్నీ చంద్రబాబే బీజేపీలోకి పంపించారని వాదిస్తూ ఉంటారు. నిజానికి వీరు బీజేపీలో చేరారు.. టీడీపీ నుంచి చాలా మంది వైసీపీలో చేరారు. మరి వారినీ చంద్రబాబే పంపించారనే లాజిక్ ఇక్కడ వర్కవుట్ అవుతుందానే అనే ప్రశ్నలు సహజంగానే ఇతర పార్టీల నుంచి వస్తూంటాయి.

యువగళంలో వారసులు..

ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పందించరు. కానీ బీజేపీలో చేరిన వారే టీడీపీ కోవర్టులని సందర్భాన్ని బట్టి విమర్శిస్తూ ఉంటారు. వైఎస్ఆర్‌సీపీకి బీజేపీతో విరోధం పెట్టుకోవడం ఇష్టం లేదు. దానికి రాజకీయ కారణాలు అయినా  .. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కారణం అయినా సరే..  ఆ పార్టీ తొందరపడాలని అనుకోవడం లేదు. సీఎం జగన్ స్పందిస్తేనే..వాల్యూ ఉంటుంది. ఇతర నేతలు స్పందించడం వల్ల రాష్ట్ర స్థాయి రాజకీయాల కోణంలోనే ఉంటుంది. అందుకే.. రాష్ట్ర నేతలు స్పందిస్తున్నారు.. అదీ కూడా టీడీపీ ప్రభావం అంటున్నారు కానీ..  బీజేపీపై తిరుగు విమర్శలకు పెద్దగా సిద్ధపడటం లేదు. వీలైనంత వరకూ టీడీపీకి లింక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ ఎస్కేపిజానికి నిదర్శనమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie