Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మంత్రి వర్సెస్ మాజీ మంత్రి

0

వరంగల్, ఏప్రిల్ 25:ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన డోర్నకల్‌లో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం మూడు దశాబ్దాలకు పైగా సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు అధికార పార్టీలో ఉన్నా, రాజకీయ వైరం మాత్రం తగ్గడంలేదు. రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్… మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ల మధ్య అధిపత్యపోరు తారా స్థాయికి చేరింది.ఒకప్పుడు సత్యవతి రాథోడ్ టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. 1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరుగగా ఆరుసార్లు రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు 1989, 2009, 2014లో సత్యవతి రాథోడ్‌తో రెడ్యానాయక్ తలపడ్డారు. ఒక్కసారి మాత్రమే 2009లో సత్యవతి చేతిలో రెడ్యానాయక్ ఓటమి పాలయ్యారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013లో టీఆర్ఎస్‌లో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్‌పై పోటీచేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యానాయక్ జయకేతనం ఎగురవేసి తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్యానాయక్ పోటీ చేసి గెలుపొందగా… టిక్కెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్‌ అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్‌లో చోటు కల్పించారు. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్‌ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించినా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికివారు తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో… ఇప్పటినుంచే భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెడ్యానాయక్ పనిచేయగా…. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యానాయక్ సందర్భోచితంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ను టార్గెట్‌  చేస్తూ విమర్శలు చేస్తుండడం కలకలం రేపుతోంది. పైగా తనను మంత్రి ఎందుకు ఇగ్నోర్‌ చేస్తున్నారో తెలియడం లేదంటూ ఇరుకున పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్‌ వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్‌ ఆశిస్తుండడంతో వీరిమధ్య గ్యాప్ మరింత పెరిగింది.

మూడుసార్లు డోర్నకల్ నుంచి పోటీచేసి ఒక్కసారే గెలిచిన సత్యవతి రాథోడ్ నాలుగోసారి మంత్రి హోదాలో అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నారు. దాంతో డోర్నకల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. సత్యవతి రాథోడ్ ప్రయత్నాలను గమనించిన రెడ్యానాయక్‌ ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారు.డోర్నకల్ నియోజకవర్గం మీద మంత్రి సత్యవతి రాథోడ్, ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు నేతలు డోర్నకల్ లో సీటు కోసం వేస్తున్న ఎత్తులతో డోర్నకల్ రాజకీయాల్లో హిట్ పెరుగుతోంది. అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తే డోర్నకల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమంటూ మంత్రి సత్యవతి నిన్న హైదరాబాదులో ప్రకటించడం రచ్చకు దారి తీసింది. డోర్నకల్ సీటు కోసం గుంట నక్కలు కాసుకొని కూర్చున్నాయంటూ రెండు రోజుల క్రితం రెడ్యా నాయక్ ఆత్మీయ సమావేశంలో చెప్పారు.

ఆ గుంట నక్కలు ఎవరా అని చర్చ జరుగుతుండగానే.. మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.రెడ్యా నాయక్ ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో  ఆవేదనతో మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలో ఇంటి దొంగలతో జాగ్రత్తగా ఉండాలి, కొందరైతే నా చావు కోసం ఎదురు చూస్తున్నారని  డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌ రెడ్యానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేసిన కామెంట్స్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెర తీశాయి. నన్ను ఓడించాలని కుట్రలు చేశారు. మళ్ళీ చేస్తారు. గుంట నక్కలు, రాబందులు పొంచుకొని ఉంటాయి.. అయినా మీ అభిమానంతో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ  డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ వ్యాఖ్యలు చేశారు.
సీరోలులో  జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రెండు గుంటనక్కలు పొంచుకొని ఉన్నాయి.

వాటికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం నేర్పుదామంటూ డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమారుడు డీఎస్ రవిచంద్ర సంచలన విమర్శలు చేశారు. ఈ సమావేశంలో ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు. తమ మనోభావాలు బహిర్గతం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే డోర్నకల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోగా ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే, మొదటికే మోసం వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఇద్దరు నేతల తీరుతో డోర్నకల్ లో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, కేటీఆర్, హరీష్ రావు కలగజేసుకుకుంటారా.. లేక సీఎం కేసీఆర్ ఇద్దరికి సర్ది చెప్తారా… లేక మంత్రి సత్యవతి రాథోడ్ కు టికెట్ కన్ఫామ్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇక అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie