Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మళ్లీ ఇసుక వ్యవహారం

0

విజయవాడ, నవంబర్  4,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు రామకృష్ణారెడ్డికి సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ద సబ్జెక్ట్ పై ఉండదని, తానే అపర మేధావినన్నట్టు అడ్డగోలుగా మాట్లాడటం తప్ప ఆయన మాటల్లో అసలు విషయం ఉండదని టీడీపీ నేత, మాజీ మంత్రి కె. ఎస్ జవహర్ అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ‘ఇసుకపై రూ. 40 వేల కోట్లు దోపిడి చేసిన జగన్ రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబు పై అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటు. సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దుకుంటూ.. దళిత మహిళా నేతపై అక్రమ కేసు పెట్టడం ఏ సామాజిక న్యాయం? ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న ఘనుడు సీఎం జగన్ రెడ్డి. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా? బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా ఇసుక ఇవ్వటమే చంద్రబాబు చేసిన తప్పా?’ అని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో ఏపీ.ఎం.డీ.సీని నోడల్ ఏజెన్సీగా నియమించి, దానిద్వారా మహిళా సమాఖ్యలకు ఇసుక రీచ్ లు అప్పగించాలని.. తద్వారా వచ్చే లాభాలలో 25శాతం  ఆదాయం మహిళాసంఘాలకు దక్కేలా చేయాలని ఆదేశిస్తూ జీవో – 94 ఇచ్చామన్నారు. ఈ డ్వాక్రా మహిళలలో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలే ఉండేవారు. ఆ వర్గాలు ఆర్దికంగా అభివృద్ది చెందటం ఇష్టం లేకనే నాడు ప్రతిపక్షనేతగా జగన్, వైసీపీ నేతలు ఇసుక లో అవినీతి అంటూ తప్పడు ప్రచారం చేశారన్నారు. వైసీపీ నేతలు పదేపదే పనిగట్టుకొని మరీ నిరాధార ఆరోపణలు ఇసుక తవ్వకాలపై చేస్తుండటంతో ఉచితంగా ప్రజలకు ఇసుక అందించామని చెప్పారు. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. చంద్రబాబు హయాంలో ఇసుకతవ్వకాలపై ఎన్జీటీ జరిమానా విధించిందని వైసీపీ చెబుతోంది.

కానీ ఎన్జీటీ తుదితీర్పులో తాము గతంలో నియమించిన ఎక్స్ పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికతో పూర్తిగా సంతృప్తి చెందాం. ఇంకా అదనంగా ఎలాంటి నివేదికలు ఇవ్వాల్సిన పనిలేదని అభిప్రాయపడుతూ.. ఎక్స్ పర్ట్ కమిటీ చాలా స్పష్టంగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగలేదని ఎన్జీటీ పేర్కొంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు చెప్పటం లేదు? అని ప్రశ్రించారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే సీఎం జగన్, ఏపీ మంత్రులు కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. ఈ కుట్ర రాజకీయాల్ని ప్రజలు చిత్తు చేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie