Andhra Pradesh : రేషన్‌ బియ్యం దొంగలకు బిగ్‌షాక్‌

Big shock for ration rice thieves

Andhra Pradesh : సివిల్‌ సప్లై వ్యవస్థ ద్వారా పేదలకు చౌకధరకే బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఇందులో పందికొక్కుల్లా మారిన కొందరు ఈ పేదల బియ్యాన్ని దారి మళ్లిస్తూ జేబులు నింపకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వారంతా చిన్న చిన్న జరిమానాలు, శిక్షలతో బయటపడుతున్నారు. ఇకపై అలా చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

రేషన్‌ బియ్యం దొంగలకు బిగ్‌షాక్‌

కాకినాడ, మే 14
సివిల్‌ సప్లై వ్యవస్థ ద్వారా పేదలకు చౌకధరకే బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఇందులో పందికొక్కుల్లా మారిన కొందరు ఈ పేదల బియ్యాన్ని దారి మళ్లిస్తూ జేబులు నింపకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వారంతా చిన్న చిన్న జరిమానాలు, శిక్షలతో బయటపడుతున్నారు. ఇకపై అలా చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రేషన్‌ బియ్యం దొంగలకు గట్టి దెబ్బే తగలనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే రేషన్‌ బియ్యం దారి మళ్లించేవారిపై రౌడీషీట్‌ తెరవాలని ఆదేశించారు. దీంతో ప్రజాపంపిణీ వ్యవస్థ అయిన రేషన్‌ డిపోల నుంచి, ఇతర మార్గాల నుంచి పీడీఎస్‌ బియ్యం దారిమళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇకపై అయినా పేదలకు చెందాల్సిన పీడీఎస్‌ బియ్యం దోపిడీకి అడ్డుకట్టపడుతుందంటున్నారు.సివిల్‌ సప్లై వ్యవస్థ ద్వారా రేషన్‌డిపోలకు చేరుతోన్న రేషన్‌ బియ్యం పలు రకాలుగా పక్కదారిపడుతోంది. చాలా మంది కార్డుదారులు తమకు అవసరం లేకపోయిన బియ్యాన్ని అదే రేషన్‌ డీలర్లకు అమ్మేస్తున్నారు.

లేదా దళారులుకు అమ్ముతుంటారు. ఈ రకంగానే చాలా వరకు బియ్యం పక్కదారిపడుతోంది. వీటిని భారీ మొత్తంలో నిల్వ చేస్తోన్న దళారులు తిరిగి మిల్లర్లకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. దీంతో అసలు ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.. పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసిన మిల్లర్లు వాటిని రీపాలిష్‌ చేసి ఆకర్షిణీయమైన ప్యాకింగ్‌లు చేసి మళ్లీ అవే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో దర్జాగా అమ్ముతున్నారు. భారీ ధరలకు విక్రయాలు చేస్తున్నారు.. చాలా మంది సన్నగా పాలిష్‌ పెట్టిన బియ్యం అని కొనుగోలు చేస్తున్నారు. కానీ అవి రేషన్‌ బియ్యమేనని గ్రహించక అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లు మరో రకమైన మోసాలకు పాల్పడుతున్నారు. తమ వద్ద నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యం తిరిగి ప్రభుత్వానికే విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. కొందరు బడా బాబులు అయితే భారీ మొత్తంలో నిల్వ చేస్తున్న పీడీఎస్‌ బియ్యం వేరే ప్యాకింగ్‌ల్లోకి మార్చి వాటిని విదేశాలకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. అందుకే కాకినాడ పోర్టులో సివిల్‌ సప్లై శాఖ మంత్రి పలు దఫాలు ఆకస్మిక దాడులు చేసి గొడౌన్లలో ఎగుమతులకు నిల్వచేసిన పెద్దఎత్తున బియ్యంను గుర్తించి సీచ్‌ చేయించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలుచేసి స్టెల్లా షిప్‌ గొడౌన్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భారీగా రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు.అత్యవసర సరకుల చట్టం 1955 చట్టం ద్వారా 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. అత్యవసర సరకులను చట్టవిరుద్ధంగా అక్రమ రవాణాచేయడం, లేదా స్వాధీనం చేసుకొని నిల్వ ఉంచడం గుర్తిస్తే ఈ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ తరహాలోనే రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వచేయడం, అక్రమంగా రవాణా చేస్తు చిక్కుతున్న సందర్భాల్లో 6ఏ కేసులు అధికారులు నమోదు చేస్తున్నారు. ఈ నేరం రుజువైతే మూడు నెలల పాటు జైలు, లేదా జరిమానా శిక్ష పడుతుంది. నేర తీవ్రత ఎక్కువైనా శిక్షలు తక్కువగా ఉండడం, ఏ మాత్రం భయపడని అక్రమార్కులు మళ్లీ పీడీఎస్‌ బియ్యం దోపిడీలకు పాల్పడుతున్నారు. నిందితుడు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడితే శిక్ష తీవ్రత పెరిగి ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు, జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.

కేసులు నమోదుల సమయంలో రాజకీయ ఒత్తిళ్లు తదితర కారణాలతో వేరే కొత్త వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో శిక్షలు పడకుండా అక్రమార్కులు తప్పించుకుంటున్నారు. దీంతో చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకుంటున్న అక్రమార్కులు మళ్లీమళ్లీ పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్‌ అక్రమ బియ్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోంది.. ఇందులో భాగంగా 2024 డిసెంబర్‌ నాటికి 1066 కేసులు నమోదు కాగా 729 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఇందులో కాకినాడ జిల్లా, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 729 మందిని ఈ కేసుల్లో అదపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. 60 టన్నుల వరకు పీడీఎస్‌ బియ్యం స్వాధీనంచేసుకోగా కాకినాడ జిల్లాలో 25, 386 మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో గుర్తించిన 50,000 మెట్రిక్‌ టన్నుల బియ్యంలో ఇది ఒక భాగంగా అధికారులు చెబుతున్నారు.

పేదలకు చెందాల్సిన పీడీఎస్‌ బియ్యం అక్రమార్కుల పాలవ్వడంపై కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు నుంచి సీరియస్‌గా తీసుకుంది. ఈనేపథ్యంలోనే కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతోన్న అక్రమ పీడీఎస్‌ బియ్యం ఎగుమతులపై దృష్టిసారించి పలు కేసులు నమోదు చేసింది. తాజాగా పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా, ఎగుమతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. ఈనేపథ్యంలోనే పీడీఎస్‌ బియ్యం అక్రమంగా దోచుకుంటున్న వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయాలని ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంతవరకు 6ఏ కేసులతో ఏం ఫరవాలేదని భావించి తమ అక్రమ దందా చేస్తోన్నవారికి ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో కంటిమీద కునుకు కరువైన పరిస్థితి తలెత్తుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు..

Read more:సంక్షిప్త వార్తలు : 13-05-2025

Related posts

Leave a Comment