Hyderabad : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారుతోంది. ఈ నోటీసులతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. నోటీసులపై బీఆర్‌ఎస్ మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోంది.
రగులుతున్న తెలంగాణ రాజకీయం
హైదరాబాద్, మే 22
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారుతోంది. ఈ నోటీసులతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. నోటీసులపై బీఆర్‌ఎస్ మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోంది. అసలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేదే బీఆర్‌ఎస్, బీజేపీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర కూడా జరుగుతోందని ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిటీ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేంద్ర, హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలపై సమాధానం చెప్పాలని పేర్కొంది. ఇదే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైంది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. నోటీసు వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్ నేతలంతా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాదని, ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ కుటిలయత్నం చేస్తున్నారని అన్నారు. దీన్నిపై కచ్చితంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కారు 20 నుంచి 30 వరకు కమీషన్లు లేనిదే ఏ పని చేయడం లేదని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వంలో లంచాలు లేనిదే ఏ పని కావడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా అంగీకరిస్తున్నారని అన్నారు. ఇవీ, పథకాలపై ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి నుంచి డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు డ్రామా తెరపైకి తెచ్చారని అన్నారు. ఇదో చిల్లర ప్రయత్నమని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తూనే ఉంటారని అన్నారు. ఈ నోటీసులపై మాజీ మంత్రి ఈటల రాజేంద్ర మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదన్నారు. నోటీసులు అందితే కచ్చితంగా కమిషన్‌కు సహకరిస్తామని ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు.
చట్టాలపై తమకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో తనను భయపెట్టలేరని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు సీఎస్‌గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలకు పాలనపై పట్టు లేదని అందుకే చిల్లర ప్రయత్నాలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇచ్చినందున ప్రభుత్వం బీజేపీ, బీఆర్‌ఎస్ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టానికి లోబడే అందరికీ నోటీసులు ఇచ్చారని ఈ విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వంపై కక్షసాధింపులకు దిగబోతున్నారని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ కూటమిగా పోటీ చేయబోతున్నాయని అన్నారు. ప్రజాప్రభుత్వ రాకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.
అసలు కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులకు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు మల్లు రవి. ఇస్తే సమాధానం చెప్పాలని ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇదేం ఈ దేశంలో కొత్తకాదని వివరించారు. ఇప్పుడు కూడా తప్పు చేయలేదని కమిషన్ ముందుకెళ్లి నిరూపించుకోవాలని సూచించారు. విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలపై జూన్ ఐదో తేదీ విచారణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆరో తేదీని హరీష్‌రావును పిలిచింది. ఏడో తేదీన ఈటలకు టైం ఇచ్చింది. ఈ నోటీసుల సంగతి వెలుగు చూసిన వెంటనే కేసీఆర్, హరీష్‌రావు సమావేశమై చర్చించారు. ఈ కమిషన్ ఎదట హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Read more:Mumbai : 25 మెట్రిక్ టన్నుల పండ్లు తిరస్కరణకు రీజనేంటీ
