Vijayawada : బెజవాడలో భారంగా అద్దెలు

vijayawada

Vijayawada : అభివృద్ధి ఉండదు.. ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు పెద్దగా ఉండవు…హైదరాబాద్‌ స్థాయి నగరం కూడా కాకున్నావిజయవాడ నగరంలో అద్దెలు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. గత పదేళ్లలో నగరంలో చెప్పుకోదగ్గ మార్పులేమి జరగక పోయినా అద్దెల భారం మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉంది.

బెజవాడలో భారంగా అద్దెలు

విజయవాడ, జూన్4
అభివృద్ధి ఉండదు.. ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు పెద్దగా ఉండవు..హైదరాబాద్‌ స్థాయి నగరం కూడా కాకున్నావిజయవాడ నగరంలో అద్దెలు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. గత పదేళ్లలో నగరంలో చెప్పుకోదగ్గ మార్పులేమి జరగక పోయినా అద్దెల భారం మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉంది.ఏపీలో మిగిలిన నగరాలతో పోలిస్తే విజయవాడలో అద్దెల భారం అధికంగా ఉంటుంది. దీనికి 2015లో హైదరాబాద్‌ నుంచి పాలనా వ్యవహారాలను ఏపీకి తరలించాలనే నిర్ణయంతో విజయవాడలో అద్దెల భారం మొదలైంది. అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్‌ఓడీల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు తరలి వచ్చారు. కుటుంబాలను వదిలి రాలేని వారికి ఇప్పటికీ ప్రభుత్వమే గెస్ట్‌ హౌస్‌ సదుపాయాలను కల్పించి మరీ పని చేయించుకుంటోంది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వమే హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తోంది. వారి హోదా, ఉద్యోగాన్ని బట్టి అద్దె చెల్లింపు ఉంటోంది. ఆలిండియా సర్వీస్ అధికారులకు ప్రతి నెల రూ.40వేలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాడర్‌ను బట్టి సగటున రూ.10వేల నుంచి రూ.30వేల వరకు నివాస సదుపాయం కోసం ప్రభుత్వం నుంచి భత్యం లభిస్తుంది.రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు అవుతుందనే ప్రచారంతో రియల్‌ ఎస్టేట్ పెద్ద ఎత్తున నడిచింది.

2014లో విజయవాడకు అవతలి వైపు కృష్ణా తీరంలో అమరావతిని ప్రకటించారు. 2015 జూన్‌లో ఉద్యోగులు అమరావతికి తరలించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2016 జూన్‌ నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు మొదలైంది.హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల కుటంబాలు తరలి రావడంతో ఓ దశలో విజయవాడలో నివాస గృహాలకు కొరత కూడా ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలకు అనువైన ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో అద్దెలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంతో సమానంతో అలవెన్సులను చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇంటి అద్దెలు పెరిగిపోయాయి. టూ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ అద్దెను కనీసం రూ.18-20వేలుగా నిర్ణయించేశారు. 3 బెడ్‌ రూమ్‌ అయితే రూ.30వేలుగా నిర్ణయించారు. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు, చిమ్నీలు, ఇంటీరియర్ బాగున్న ఫ్లాట్లకు రూ.35-40వేలకు తక్కువగా లభించేవి కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తుండటంతో వారిపై ఈ భారం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని పెంచిన అద్దెలతో మిగిలిన వారికి శాపంగా మారింది.ఇంటి అద్దెల భారం ప్రధానంగా వేతనాలపై ఆధారపడిన మధ్య తరగతిపైనే పడింది.

గత పదేళ్లలో అద్దెల భారం పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. విజయవాడలో ఐటీ ఆధారిత పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్‌ ద్వారా లభించే ఉపాధి అవకాశాలు ఉండవు.2019లో రాజధాని నిర్మాణ పనులు నిలిచి పోవడంతో అమరావతి నిర్మాణ పనుల కోసం వచ్చిన ఇంజనీర్లు, కన్సల్టెంట్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఓ దశలో అద్దెల్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. కోవిడ్‌ మొదటి దశలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇది కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.కోవిడ్‌‌లో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం రావడంతో అద్దెలను కొంత మేరకు తగ్గించినా అవి మెల్లగా మునుపటి స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ అమరావతి పనులు ప్రారంభం కావడంతో విజయవాడతో పాటు తాడేపల్లిలో కళ్లు చెదిరేలా అద్దెలు వసూలు చేస్తున్నారు. కొత్త ఫ్లాట్లకు కనీసం రూ.25వేలు తగ్గకుండా రెంట్ వసూలు చేస్తున్నారు.

ప్రైవేట్‌ రంగంలో పనిచేసే వారు కనీసం నెలకు రూ. లక్ష రుపాయల వేతనం ఉంటే తప్ప అద్దెల భారాన్ని మోయలేని పరిస్థితి విజయవాడలో ఉంది.ఏపీలో ప్రధానంగా గత ఐదేళ్లలో నిర్మాణ పనులు పూర్తైన భవనాల విషయంలో అంచనాలకు మించి వ్యయాన్ని భరించాల్సి వచ్చినందునే అద్దెలు పెంచాల్సి వచ్చిందని బిల్డర్లు చెబుతున్నారు. 2020-22 మధ్య కాలంలో 30టన్నుల ఇసుక ఖరీదు రూ.50వేల వరకు ఉండేదని, భవన నిర్మాణంలో వినియోగించే స్టీల్‌, సిమెంట్‌, శానిటరీ, ఇంటీరియర్‌ వంటి వాటి ధరల్లో అంచనాలకు వాస్తవానికి మధ్య 35-40శాతం తేడాలు వచ్చాయని చెబుతున్నారు.పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా వచ్చే పరిస్థితులు లేనందునే చాలా చోట్ల అద్దెలకు ఇస్తున్నట్టు బిల్డర్లు వివరించారు. చిన్న, మధ్య తరహా బిల్డర్లు ధరల భారం వల్ల తీవ్రంగా నష్టపోయారని, అద్దెల పెరుగుదలకు ఇది కూడా కారణమని విజయవాడకు చెందిన బిల్డర్ రాజేంద్ర వివరించారు.విజయవాడ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత వాతావరణంతో ఫ్లాట్ల అమ్మకాలు కూడా వేగంగా జరగడం లేదు. ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల్లో విజయవాడలో రియల్‌ ఎస్టేట్‌ మీద పెట్టుబడులు పెట్టడంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. రాజకీయంగా ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన పెట్టుబడులపై ప్రభావం చూపిస్తోంది. ఐదేళ్ల తర్వాత ఏమి జరుగుతుందోననే ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు, కొనుగోళ్లలో స్పీడ్‌ తగ్గింది.

Read more:Vangaveeti Radhakrishna : కాపు నేతలకు గాలం

Related posts

Leave a Comment