Andhra Pradesh:ఏపీలో మండుతున్న సూరీడు

Burning sun in AP

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని స్థాయిలో నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఏపీలో మండుతున్న సూరీడు

కర్నూలు, ఏప్రిల్ 24
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని స్థాయిలో నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.వైఎస్సార్ జిల్లాలో 28, నంద్యాల 22, ప్రకాశం జిల్లాలో 17, పల్నాడు 14, కర్నూలు జిల్లాలోని పదిచోట్ల 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని 30 మండలాల్లో తీవ్రవడగాలులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం, ఎండవేడిమి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. రోజువారీ పనుల కోసం బయట తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలుల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం, పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్ వంటివి తీసుకోవాలని చెప్తున్నారు. వేసవి సీజన్‌లో దొరికే పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లతో పాటుగా కీరదోస, బత్తాయి, ద్రాక్ష, పైనాపిల్‌ ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. వీటిలో నీటిశాతం అధికంగా ఉంటుందని.. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడతాయని వివరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని.. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి ధరించాలని సూచిస్తున్నారు.

వడదెబ్బ ఎవరికి తగులుతుందంటే..

ఎండాకాలంలో వడదెబ్బ ఫలానా వయసు వారికే తగులుతుందని చెప్పడానికి వీలులేదు.ఎవరికైనా తగలవచ్చు. అయితే శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులతో పాటుగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. సెలవుల సీజన్ కావటంతో శుభకార్యాలు, విహార యాత్రలకు ఎక్కువగా వెళ్తుంటారని, ఈ సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని.. వేపుళ్లు, జంక్‌ఫుడ్, మద్యం, మాంసాహారం తక్కువగా తీసుకుంటే మంచిదంటున్నారు. తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, రక్తపోటులో తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Read more:Andhra Pradesh:నాటకాల రాయుడికి చెక్..

Related posts

Leave a Comment