Hyderabad:తెలంగాణలో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయితీలు, మండల పరిషత్‌లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ప్రభుత్వ వర్గాల నుండి వినిపిస్తోంది. ఇఫ్పటికే ఎన్నికల నిర్వహణకు ఆలస్యం కావడంతో త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేసి గ్రామాల్లో పాలకవర్గాలను ఏర్పాటుచేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడుతోంది.
గ్రామాల్లో ఎన్నికల హడావిడి
హైదరాబాద్, మే 8
తెలంగాణలో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయితీలు, మండల పరిషత్‌లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ప్రభుత్వ వర్గాల నుండి వినిపిస్తోంది. ఇఫ్పటికే ఎన్నికల నిర్వహణకు ఆలస్యం కావడంతో త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేసి గ్రామాల్లో పాలకవర్గాలను ఏర్పాటుచేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడుతోంది. ఏడాదికాలంగా గ్రామ పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది… అధికారంలోకి వచ్చింది మొదలు రేపు మాపు అంటూనే ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది కాంగ్రెస్ సర్కార్. అయితే మరో రెండునెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు, మండల పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్దమైందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ డేటా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉండటంవల్లే ఎన్నికలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
దీనిపై స్పష్టత రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. జూలైలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికలకు సిద్దమయ్యింది. బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకుంది. ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలువడగానే షెడ్యూల్ విడుదలచేసి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ చివర్లో లేదంటే జూలై ఆరంభంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు కొద్దిరోజుల వ్యవధిలోనే నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించి కేవలం 15-20 రోజుల్లో ఈ ప్రాసెస్ ను పూర్తిచేయాలని.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా ఇలాగే తక్కువ సమయంంలో పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా ఒకే విడతలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఈసి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే జూలైలో గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలుకానుంది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు..
ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటుతుంది. అయితే ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది, తద్వారా న్యాయ సమీక్ష నుండి రక్షణ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలోని 540 మండలాల పరిధిలో ఉన్న 12,966 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 1,14,620 వార్డులకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
