Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

శబరిమలలో భక్తుల ఆందోళన

0

తిరువనంతపురం, డిసెంబర్ 15,

శరణు అయ్యప్పా అంటూ ఆ శబరిగిరీశుని దర్శిస్తే భక్తుల బాగోగులు ఆ స్వామి చూసుకుంటారనీ.. పంపానదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.. కానీ ఆ స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు రావడం.. అదే సమయంలో అధికారులు, ఆలయసిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ లక్ష మందికి పైగా భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నారు. శబరిమలకు భక్తులు పొటెత్తడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో…అధికారులు పంబాకు వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు . ఫలితంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రోడ్డుపైన నిరసనకు దిగారు. ఎరుమెలి- పంబా రోడ్డుపై అయ్యప్ప పాటలు పాడుతూ ఆందోళన నిర్వహించారు.

పంబాకు వాహనాలు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని…అయ్యప్ప భక్తులతో  ఆందోళనను విరమింపజేశారు. భక్తుల రద్దీ అదుపులోకి వచ్చాక వాహనాలను అనుతిస్తామని హామీ ఇవ్వడంతో భక్తులు వెనక్కితగ్గారు. భక్తుల ఆందోళనలపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణన్ స్పందించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామన్న ఆయన, భక్తుల కోసం ఆర్టీసీ బస్సులను సైతం వినియోగిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆన్లైన్ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.దీంతో స్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల పడుతోంది. క్యూలైన్‌లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. పందళంలోని వలియకోయికల్ ఆలయానికి చేరుకుని నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోతున్నవారిలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారాయన.వారం రోజులుగా శబరిమలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ట్రావెన్‌కోర్‌ అధికారులు-పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదునెట్టాంబడి దగ్గర భక్తులు నెమ్మదిగా కదలడం.. 18 మెట్ల దగ్గర పోలీసులు లేకపోవడం.. కేరళ పోలీసులకు.. దేవస్థానం అధికారులకు సమన్వయం లేకపోవడం వల్లే సజావుగా దర్శనం జరగడం లేదని భక్తులు మండిపడుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie