KCR : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు

KCR Appears Before Kaleshwaram Inquiry Commission

KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది.

కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు:

కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ.

జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు అడిగారు.

వాటికి కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ సమక్షంలో విచారణ జరగగా.. కేసీఆర్ తనకు స్వల్ప జలుబు, అనారోగ్యం ఉందని తెలిపారు. ఈ కారణంగా, బహిరంగ హాలులో ముఖాముఖి విచారణ కాకుండా వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు ‘ఇన్‌కెమెరా’ విచారణను ఆయన కోరారు.

కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పీసీ చంద్రఘోష్, బహిరంగ కోర్టు హాలు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపి విచారించారు. 115వ సాక్షిగా విచారణకు హాజరైన కేసీఆర్‌ను, గత 14 నెలలుగా అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రుల నుంచి సేకరించిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అందుకు తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాగు, సాగునీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కూడా కేసీఆర్ కమిషన్‌కు వివరించారని సమాచారం.

కమిషన్ ప్రశ్నలు – కేసీఆర్ సమాధానాలు:

కమిషన్: మూడు బ్యారేజీల రీ-ఇంజనీరింగ్ ఎలా చేశారు? కేసీఆర్: రీ-ఇంజనీరింగ్, బ్యారేజీల నిర్మాణం క్యాబినెట్ ఆమోదంతో జరిగింది. వ్యాప్కాన్స్ నివేదికల ఆధారంగానే మూడు బ్యారేజీల నిర్మాణం జరిగింది.

కమిషన్: కాళేశ్వరం నిర్మాణానికి ఏ విధంగా నిధులు సేకరించారు? కేసీఆర్: నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.

కమిషన్: బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారు? కేసీఆర్: సాంకేతిక అంశాల ఆధారంగా నిల్వ (స్టోరేజ్) నిర్ణయం అధికారులు తీసుకున్నారు.

కమిషన్: బ్యారేజీల స్థానాల (లొకేషన్స్) మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు? కేసీఆర్: సాంకేతిక నివేదికల ఆధారంగా బ్యారేజీల స్థానాలు మార్పులు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశానికి క్యాబినెట్ అనుమతి ఉంది.

కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్‌కు అందజేశారు. విచారణ ముగిసిన అనంతరం, కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చి అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ తన కారులో వెళ్లిపోయారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు ఉన్నారు.

Read alsoUPI Payments : యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు!

Related posts

Leave a Comment