Police Station : విజయవాడలో కొత్తగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభమైంది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్‌గా రికార్డు సృష్టించిందని.. ఇది కార్పొరేట్ ఆఫీస్‌లా ఉందన్నారు.
కార్పొరేట్ స్టైల్ లో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్
విజయవాడ, జూన్ 3
విజయవాడలో కొత్తగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభమైంది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్‌గా రికార్డు సృష్టించిందని.. ఇది కార్పొరేట్ ఆఫీస్‌లా ఉందన్నారు. ఈ పోలీస్ స్టేషన్‌ను 320 గజాల స్థలంలో రూ. 2 కోట్లతో నిర్మించామని.. రాష్ట్రంలోనే జిమ్ కలిగిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఇదే అన్నారు. మహిళలకు, పిల్లలకు సౌకర్యంగా ఉండేలా దీనిని నిర్మించామని.. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచడానికి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించామని.. సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థుల ఆటకట్టిస్తున్నారని ప్రశంసించారు. ఎలాంటి నేరం జరిగినా వెంటనే నిందితులను పోలీసులు పట్టుకుంటున్నారన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు హోం మంత్రి అనిత.
తెనాలిలో రౌడీ షీటర్ల ఘటనపై కూడా స్పందించారు. ‘శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే.. తప్పు చేసిన వారికి కులం ఏంటి మతం ఏంటి’ అన్నారు. ‘పోలీసులపై దాడి చేసేవారికి కూడా రాజకీయ రంగు పులమడం సరికాదు.. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే రెక్కలు విరిచి కొట్టారు’ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్తే రాళ్లు విసిరి భావ స్వేచ్ఛ ప్రకటన అని అన్నారని.. . టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ అనలేదా అని గతంలో చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించారు.తాము పరదాలు కట్టుకునో, దాక్కుని వెళ్లడం లేదని.. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామన్నారు హోంమంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం, హోం మంత్రి చేతుల్లో లేదని.. సజ్జల కనుసన్నల్లోనే నడిచిందన్నారు అనిత.
తాము పోలీసులకు చట్టపరంగా పని చేసే స్వేచ్ఛను ఇచ్చామని.. వైఎస్సార్సీపీ సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులను అరెస్టు చేస్తూ ప్రజలకు రక్షణ కల్పి్స్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని.. ఒడిశా నుంచి కొంత రవాణా జరుగుతోందన్నారు. అలాగే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేలో పోలీసులు సైతం పాల్గొంటారన్నారు.’విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావుగారితో కలిసి ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పదానికి అర్థం చెప్పేలా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలోనే తొలిసారిగా మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్ లోనే యోగా, జిమ్ రూములు నిర్మించడం జరిగింది. మహిళలు ఫిర్యాదు చేయడానికివచ్చిన సమయంలో వారి పిల్లల కోసం ప్లే జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ను మోడల్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దేలా కృషి చేసిన అధికారులకు నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
Read more:Bangalore : ఇక బెంగళూర్ ప్రయాణం ఈజీ
