Cold storages : కోల్డ్ స్టోరేజీల్లోకి.. కొన్ని హామీలు

Cold storages... some guarantees

Cold storages : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన పరిస్థితి. మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలయింది.

కోల్డ్ స్టోరేజీల్లోకి.. కొన్ని హామీలు

విశాఖపట్టణం, జూన్ 4
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన పరిస్థితి. మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలయింది. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా, ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నప్పటికీ అది సాథ్యమయ్యే పనికాదు. లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. కొన్ని హామీలు అస్సలు ఐదేళ్ల పరిపాలనలో కూడా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు కూడా చెప్పలేక చేతులు పిసుక్కుంటున్నారు. నెల నెలా పింఛను మొత్తం చెల్లించాలి. ప్రతి నెల ఒకటో తేదీన 2,500 కోట్ల రూపాయలు అవసరం. ఇక ఈ నెలలో రెండు ప్రతిష్టాత్మకమైన పథకాలు అమలు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే చంద్రబాబు విడతల వారీగా వాటిని జమ చేస్తామని చెబుతూ కొంత ఆర్థిక శాఖపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం మూడు విడతలుగా చేస్తారట.

అన్నదాత సుఖీభవం పథకం కూడా అంతే. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు, అన్నదాత సుఖీభవం పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ రెండు పథకాలతో పాటు ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి, పోలవరం ప్రాజెక్టు కోసం ఇస్తున్న నిధులతో పాటు ఇతర వాటికి ఇచ్చే నిధులను తాను సంక్షేమ పథకాలకు ఖర్చు చేయలేమని చంద్రబాబు చెప్పేశారు. ప్రజలు తనను అర్థం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి బయటపడటానికి తాము ప్రయత్నిస్తున్నామని పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోతుందని, అందుకే ఎన్నిఅప్పులు చేసినా గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రుణాలను తీర్చడానికి నిధులు వెచ్చించాల్సి వస్తుందని వాపోయారు.

అందుకే ఆలస్యంగా హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మూడు పథకాలు మాత్రం కొనసాగే అవకాశముంది. అంతే తప్ప చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల భృతి పథకం మాత్రం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయల నిధులు అవసరమవుతాయి. ఈ హామీని కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేసినట్లే. ఇక నలభై ఏళ్లునిండిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదు. మరొక వైపు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీని కూడా నిధుల లేమితో బీమా కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం లేదని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ రకంగా నచ్చ చెబుతారన్నది వేచి చూడాల్సింది.

Read more:Jagan Mohan Reddy : జగన్ అప్పుడే తొందరా

Related posts

Leave a Comment