Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

58 ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది: కరీంనగర్‌లో కేసీఆర్

0
  • కాంగ్రెస్‌ దోకాబాజ్‌ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను ఏడిపించిందన్న ముఖ్యమంత్రి
  • తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు కరీంనగర్ ఎన్నో విజయాలు అందించిందన్న కేసీఆర్
  • 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపాటు  

58 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్‌ దోకాబాజ్‌ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను దశాబ్దాల పాటు ఏడిపించిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్ కేంద్ర బిందువుగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిందని, ఇందుకు కరీంనగర్ గడ్డకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. 2011 మే 17న మొట్టమొదటి సింహగర్జన సభ ఇదే వేదికపై జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం తీసుకరాకపోయినా, ఉద్యమాన్ని విరమించినా తనను రాళ్లతో కొట్టి చంపండని నాడు ఇక్కడ జరిగిన సభలో చెప్పానని గుర్తు చేశారు. దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రారంభించుకున్నామన్నారు. కాంగ్రెస్ 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ అన్నారు.

2004లో కాంగ్రెస్ మనతో పొత్తుపెట్టుకుని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆర్నెల్లకో, ఏడాదికో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు మోసం చేశారన్నారు. పదమూడేళ్లు పోరాడితే కానీ తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ మన పార్టీని చీల్చే ప్రయత్నాలు కూడా చేసిందన్నారు. దాంతో కేసీఆర్‌ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని, ఆ దీక్షకు కూడా కరీంనగర్‌ గడ్డనే వేదిక అయిందన్నారు. తనను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారన్నారు. కరీంనగర్ ఉద్యమాల గడ్డ అన్నారు.

ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా? లేదా? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయని, అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు ఇరవైలో ఉండేనని, కానీ ఇప్పుడు మన తెలంగాణ రూ.3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. కడుపు, నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. ఇక రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగమని, 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లుగా ఉండెనని, ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దేశంలో నెంబర్ 1గా ఉన్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie